సాక్షి, అమరావతి: గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్ వశిష్ట బోటును ప్రయివేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగింది.
సహాయక చర్యలకు రంగంలోకి దిగిన హెలికాఫ్టర్
ఇందుకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లను సంఘటనా స్థలానికి పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం మంత్రి అవంతి ...విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఉదయభాస్కర్, ఝాన్సీరాణి అనే బోట్లు ప్రమాదానికి గురై అనేకమంత్రి ప్రాణాలు కోల్పోయారు.
సహాయక చర్యలకు హోంమంత్రి ఆదేశం
అలాగే బోటు ప్రమాదంపై హోంమంత్రి సుచరిత ఆరా తీశారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గల్లంతు అయినవారి కోసం గాలించి సరక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా లాంచీ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ముత్యాల రాజుతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో పాపికొండలకు విహార యాత్రకు వెళుతున్న పర్యాటక బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 61మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 27మంది సురక్షితంగా బయటపడగా, పలువురు గల్లంతు అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
బ్రేకింగ్ : గోదావరిలో పడవ మునక
Comments
Please login to add a commentAdd a comment