సాక్షి, కొవ్వూరు: గోదావరి అందాలతో మనసు పులకిస్తుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యాలు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన పాపికొండలు చూపరులకు కనువిందు చేస్తాయి. గోదారిపై నిర్మించిన వంతెనలు గోదారమ్మకు మణిహారాలను తలపిస్తాయి. ఏటా ఈ ప్రాంతంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. గోదావరి తీరాన్ని పర్యాటక హబ్‌గా మార్చుతామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు గుప్పించారు. కొవ్వూరు–రాజమండ్రి మధ్య ఉన్న పాతరైలు వంతెనని పాదచారుల వంతెనగా మార్చుతామన్న హామీ నేటికీ అమలుకి నోచుకోలేదు. దొంగరావిపాలెం, పెద్దమల్లంలో రిసార్ట్స్ వద్ద సౌకర్యాలు లేమి వెంటాడుతోంది. కొవ్వూరులో చేపట్టిన రిసార్ట్స్ నిర్మాణం అసంపూర్తిగా మిగిలి మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న పాపికొండల టూరిజం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.
అందని బిల్లులు... అసంపూర్తిగా పనులు
కొవ్వూరులో పాత రైలు వంతెన సమీపంలో గోదావరి ఒడ్డున పర్యాటక శాఖ చేపట్టిన రిసార్ట్స్, రెస్ట్ రూములు, హోటల్ తదితర నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 9.90 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.7.75 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఏడాది క్రితమే పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థకి ఇంత వరకు బిల్లులు అందలేదు. సుమారు రూ. 2.80 కోట్లు విలువైన పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో ఆరు నెలల క్రితమే పనులు నిలిచిపోయాయి. పనులు అసంపూర్తిగా ఉండడంతో నేడు మొండిగోడలు దర్శనమిస్తున్నాయి.
లక్షల వ్యయం... నిర్వహణపై నిర్లక్ష్యం
గోదావరి పుష్కరాల సమయంలో పర్యాటక శాఖ కొవ్వూరులో రూ.84 లక్షలు వెచ్చించి నిర్మించిన పర్యాటకుల విశ్రాంతి భవనాలు నిరుపయోగంగా మారాయి. ఐదేళ్లుగా ఈ భవనాల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో లక్షల వ్యయంతో నిర్మించిన విశ్రాంతి గదులు, భవనం అక్కరకు రాకుండా పోయాయి. కేవలం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి విచ్చేస్తుంటారు. ఈ భవనం గోష్పాద క్షేత్రంలో నిర్మించి ఉంటే అక్కరకు వచ్చేది. అనాలోచితంగా సుబ్రమణ్య స్నానఘట్టం వద్ద ఈ భవనం నిర్మాణం చేశారు. దీని నిర్వహణ పట్ల పర్యాటక శాఖ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు.
గోదావరి టూరిజానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ చంద్రబాబు ప్రకటనలు గుప్పించడం తప్ప ఇటువంటి భవనం వినియోగంలోకి తీసుకురావడం పట్ల శ్రద్ధ చూపడం లేదు. దీంతో కింది అంతస్తుని జాలర్లు పడవలు, వలలు భద్రపరుచుకోవడానికి వాడుకుంటు న్నారు. పై అంతస్తు ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ సామాన్లు అన్నీ అపహరణకు గురయ్యాయి. రూములకు, టాయిలెట్స్‌కు ఏర్పాటు చేసిన తలుపులు సైతం అపహరించుకుని పోయారు. టాయిలెట్స్‌లో సింక్‌లను ఆకతాయిలు ధ్వంసం చేశారు. దీంతో రూ.84 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పర్యాటకుల విశాంత్రి భవనం అక్కరకు రావడం లేదు.
పాపికొండల విహారంపై నిర్లక్ష్యం
జిల్లాలో ప్రధానంగా గోదావరి పాపికొండల అభయారణ్యం విహారయాత్రకు మంచి ప్రదేశం. గోదారిలో సుమారు యాభై బోట్లు నిత్యం పర్యాటకులను పాపికొండలకు తీసుకెళ్తున్నాయి. భద్రాచలం–పాపికొండల అభయారణ్యం ప్యాకేజీలో భాగంగా గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు రాజమండ్రి నుంచి రావాల్సి వస్తుంది. ఇక్కడి బోటు టూరిజం, రవాణా, హోటళ్లు, లాడ్జీలు వంటి ద్వారా నెలకి రూ.కోట్లలోనే ఆదాయం వస్తుంది. సుమారు రెండు వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది. పోలవరం, పట్టిసీమ ప్రాంతాల్లో పర్యాటకులకు అన్నీ సదుపాయాలు సమకూర్చితే ఇక్కడి స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
కేవలం గత పుష్కరాల సమయంలో పట్టిసీమలో ఒక్క విశాంత్రి భవనం మాత్రమే ప్రభుత్వం నిర్మాణం చేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి పోలవరం ప్రాజెక్టు, పాపికొండల వరకు గోదావరి తీరాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఐదేళ్లలో చేసింది మాత్రం శూన్యం. పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో, ఆచంట మండలం పెద్దమల్లంలో రూ.80 లక్షలతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్స్ నిర్మాణం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం, బోట్ షికార్ వంటివి సమకూర్చక పోవడంతో అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. పెద్దమల్లం వెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అంతంత మాత్రంగానే వినియోగిస్తున్నారు. కొవ్వూరులో బోట్ టూరిజం ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఆదరణ ఉన్న గోదావరి టూరిజాన్ని చంద్రబాబు సర్కారు పూర్తి నిర్లక్ష్యం చేసింది.
అటకెక్కిన పాదచారుల వంతెన హామీ
హేవలాక్ వంతెన (పాతరైలు వంతెన)ని పాదచారుల వంతెనగా మార్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ఎంపీ మాగంటి మురళీమోహన్ హామీ కార్యరూపం దాల్చలేదు. మూడేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలతోనే కాలక్షేపం చేస్తున్నారు. గత ఏడాది ఈ రైలు వంతెనని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్టు ఎంపీ ప్రకటించారు. త్వరలోనే పనులకు శ్రీకారం చుడతారని, నిధులు కుడా మంజూరైనట్లు చెప్పుకొచ్చారు. ఇంత వరకు ఆ ప్రక్రియకి అతీగతీ లేదు. 1997 మార్చి 12 నుంచి ఈ వంతెనపై రాక పోకలు నిలిపివేశారు. వంతెనపై ఉన్న ఇనుముని రైల్వే శాఖ తుక్కుగా విక్రయించాలని ప్రయత్నించింది. దీనిపై ఉభయ గోదావరి జిల్లా వాసులు ఎన్నో ఉద్యమాలు చేయడంతో అప్పట్లో రైల్వే శాఖ తమ ప్రయత్నాన్ని విరమించుకుంది.
దీన్ని పాదచారుల వంతెనగా మార్చాలని డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు. గోదావరి మధ్యలో ఇసుక తిన్నెలపై తాత్కాలిక రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వంతెనపై చిరు వ్యాపారుల హాకర్స్ జోన్‌గా ఏర్పాటు చేయాలని భావించారు. గోదావరి తీరాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు హామీ అమలుకి నోచుకోలేదు. గోష్పాదక్షేత్రంతో పాటు రోడ్డు కం రైలు వంతెన, ఆర్చ్ రైలు వంతెన, పాతరైలు వంతెన, నాలుగో రోడ్డు వంతెన, ధవళేశ్వరం ఆనకట్ట వంటి నిర్మాణాలు ఈ ప్రాంతాన్ని కనువిందు చేస్తాయి. బోట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్న ప్రకటన అమలుకి నోచుకోలేదు. చంవ్రబాబు, ఎంపీ మురళీమోహన్ ప్రకటనలు కార్యరూపు దాల్చక పోవడంతో నేడు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment