సాక్షి, ఏలూరు : జిల్లాలో ఫ్యాన్ హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ దాడులకు తెగబడినా, ప్రలోభాలకు తెరలేపినా ప్రజల చైతన్యం జిల్లాలో ఫ్యాన్‌కు ఓటేశాలా చేసింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, దోపిడీ, దౌర్జన్యాలను నిరసిస్తూ ప్రజలు కసితో ఓటు వేశారు. జిల్లా వ్యాప్తంగా 3417 పోలింగ్ కేంద్రాల్లో 11074 ఓటింగ్ యంత్రాలు, 8842 వీవీ ప్యాట్‌లు ఉపయోగించారు.
అయితే సమారు 400 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించి గంట, రెండు గంటల అనంతరం తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు 8శాతం ఓటింగ్ నమోదయితే సాయంత్రం 5 గంటలకు 67.28శాతం ఓటింగ్ నమోదయ్యింది. రాత్రి 9 గంటల సమయానికి అందిన సమాచారం మేరకు 70.59 శాతం పోలింగ్ నమోదైంది.
గతంకంటే తక్కువ
గత సార్వత్రిక ఎన్నికలలో 84శాతం పోలింగ్ నమోదయితే ఈ సారి ఎన్నికల్లో 70.59 శాతం రాత్రి 9 గంటల వరకూ అందిన సమాచారం మేరకు నమోదైంది. అయితే ఇది మరింత పెరిగినా 80 శాతం లోపే పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గత సార్వత్రిక ఎన్నికలకంటే తక్కువగానే పోలింగ్ శాతం నమోదయ్యినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జిల్లా అధికారులు పోలింగ్‌శాతాన్ని 90శాతం కంటే ఎక్కువగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా వ్యాప్తంగా 32,18,407 ఓటర్లు ఉంటే 22,72,032 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పనిచేయని ‘మైక్యూ’యాప్
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన మైఓట్‌క్యూ యాప్ ఆశించిన మేరకు జిల్లా ప్రజలకు ఉపయోగపడలేదు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు “మైఓట్‌క్యూ’ యాప్ ద్వారా తమ పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల బారులు ఏవిధంగా ఉన్నాయో పరిశీలించేందుకు ప్రయత్నించారు. కానీ ఏ విధంగానూ ఈ యాప్ పనిచేయలేదు. మైఓట్‌క్యూ యాప్ ప్రారంభిస్తే కనీసం సిగ్నల్ లేదనీ, ఓటరు లైన్ ప్రిపేర్ కాలేదనే సమాధానమే కనిపించింది తప్ప ఏ విధంగానూ క్యూ పరిస్థితి ఓటరుకు తెలీలేదు.
ఉదయం పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో చాలా దూరం వరకు క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికితోడు భానుడు ప్రతాపం చూపడంతో ఓటర్లు ఎండదెబ్బ, ఉక్కబోతకు ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, వికలాంగులు కూడా అవస్ధలు పడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద ఓటర్లకు మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నాలుగైదు నియోజకవర్గాల్లో రాత్రి పదకొండు గంటల వరకూ ఓటింగ్ జరుగుతోంది.
అర్ధరాత్రి అయినా ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలో నిలబడ్డారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ మూడోస్థానానికి పరిమితం అయ్యింది. భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య పోటీ నడిచింది. దీంతో జిల్లాలో పలుచోట్ల తెలుగుదేశం నేతలు దాడికి తెగబడ్డారు. నిడదవోలు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు అరాచకం సృషించారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి.
పెన్నాడ గ్రామంలోని 177వ నంబర్‌గల పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రాలు తారుమారయ్యాయి. మొదటి పార్లమెంట్ అభ్యర్థికి చెందిన ఓటింగ్ యంత్రం తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఓటింగ్ యంత్రం బూత్‌లో అమర్చాల్సి ఉంది. ఓటరు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసుకుంటాడు. అయితే 177వ నెంబరు బూత్‌లో ముందు ఎమ్మెల్యే అభ్యర్థికి, తర్వాత ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఓటింగ్ యంత్రాలను అమర్చారు.
ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ పోలింగ్ సిబ్బందిగాని, పోలింగ్ ఏజెంట్లుగాని గమనించలేక పోయారు. మాజీ సర్పంచ్ వైఎస్సార్‌సీపీ నాయకుడు మంతెన సుబ్రహ్మణ్యం రాజు గమనించి ఈ విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ దష్టికి తీసుకువెళ్లారు. ఆయన తప్పయిపోయింది క్షమించండని సమాధానం చెప్పడంతో మాజీ సర్పంచ్ నర్సాపురం ఆర్డీఓకు, ఆర్వోకు, ఎన్నికల అబ్జర్వర్‌కు ఫిర్యాదు చేశారు. రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 112లో ఈవీఎం మొరాయించింది.
అవగాహన లేకపోవడంతో వీఆర్‌ఏ ఈవీఎం బాక్స్‌ని తెరవడంతో అందులో అప్పటి వరకూ వేసిన ఓట్లకు సంబంధించిన డేటా ఎరేజ్ అయ్యింది. సమాచారం తెలియడంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆర్‌డీఓ చక్రధరరావు. మరొక ఈవీఎం ఏర్పాటు చేయడంతో తిరిగి ప్రారంభం అయ్యింది. అప్పటికే 80 కి పైగా ఓట్లు పోలైనట్లు నిర్దారణకు వచ్చిన అధికారులు పోలైన వీవీప్యాట్ స్లిప్పుల ఆధారంగా కౌంటింగ్ చేస్తామని, ఈవీఎం బాక్సు తెరిచిన వీఆర్‌ఎను విధుల నుండి తొలగిస్తున్నామని ఆర్‌డీఓ తెలిపారు.
అధికార పార్టీకి చెందిన నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్దంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బౌండరీలను టీడీపీకి చెందిన ద్విచక్ర వాహనదారులు దాటడంతో పాటు పోలీసు, ఇతర సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఏలూరు రూరల్ మండలం మహేశ్వరపురం ఆర్‌సీఎం భూత్‌లో ఈవీఎం మూడుసార్లు మొరాయించింది. ఫలితంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 3–00 గంటలకు తిరిగి ఈవీఎం పనిచేయడంతో పోలింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment