జాతరలో ఏర్పాటు చేసిన టూరిజం లగ్జరీ గుడారాలు
అమ్మల చెంత కిక్కిరిసి జనం మొక్కులు చెల్లించి తరించారు.. ఈ భక్తప్రవా హానికి తగిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర టూరిజం, ఎకో టూరిజం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు అందరిని ఆకట్టుకున్నాయి. వాటిలో సేదతీరిన వీఐపీ భక్తులు టూరిజం శాఖ సేవలు భేష్ అని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మిశ్రమ స్పందనను వెలిబుచ్చారు.
ములుగు: మేడారం మహా జాతరకు రెండురోజుల ముందు నుంచి టూరిజం శాఖ ఆన్‌లైన్ పద్ధతిన అటవీశాఖ ఏకోటూరిజం సెల్‌ఫోన్ నంబర్ ద్వార బుకింగ్ ఆహ్వానించారు. తెలంగాణ టూరిజం తరఫున ఏర్పాటు చేసిన లగ్జరీ గుడారాలకు సౌకర్యాల విషయంలో మంచి స్పందన వచ్చింది. ఏకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. మొత్తానికి టూరిజం శాఖ భళా..అనిపించుకోగా, ఏకో టూరిజం శాఖ తరఫున ఏర్పాటు చేసిన గుడారాలు ఢీలా పడ్డాయి.
ప్రత్యేక ఆకర్షణగా టూరిజం గుడారాలు
తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల, గిరిజన ఆదివాసీ మ్యూజియంల మధ్యలో ఈ జాతరలో భాగంగా 47 గుడారాలను ఏర్పాటు చేశారు. ఇందులో 20 లగ్జరీ గుడారాలు, 10 వీఐపీ, మరో 10 వీవీఐపీ గుడారాలు ఉన్నాయి. బుధవారం– 27, గురువారం –32, శుక్రవారం –44, శనివారం–45 గుడారాలు బుకింగ్ అ య్యా యి. ఇందులో రెండు లగ్జరీ గుడారాలను ఇంటర్నేషనల్ ప్రిలాన్స్ మీడియాకు కేంద్రం తరుపున బుకింగ్ చేయించారు. గుడారాల్లో ఏర్పాటు చేసిన బెడ్లు, ఫ్యాన్, కూలర్ల సౌకర్యాలు బాగున్నాయని వీవీఐపీ భక్తులు తెలిపారు. ఈ గుడారాలు మేడారం సమ్మక్క–సారమ్మల గద్దెలకు దగ్గరగా ఉండడంతో వీఐపీల దర్శనం సులువుగా మారింది. పైగా బుకింగ్ చేసుకున్న భక్తుల వాహనాలను నేరుగా గుడారాల వద్దకు పార్కింగ్ చేసుకునే విధంగా టూరిజంశాఖ తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో సఫలమయింది.
అటవీశాఖకు ఆదరణ కరువు
అటవీశాఖ ఏకోటూరిజం ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుక భాగంలో 100 గుడారాలను ఏర్పాటు చేశారు. 12 గంటల సమయానికి రూ.800, 24 గంటల పాటు ఉండడానికి రూ.1500లను కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా బుకింగ్‌కు ఆహ్వానించారు. గుడారాలను ఏర్పాటు చేసిన రెండోరోజు నుంచి బుకింగ్ ప్రారంభమైనా భక్తుల నుంచి ఆదరణ కరువైంది. కేవలం ఫోన్‌నెంబర్ల ఆధారంగా మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో అధికారుల ప్రయత్నం విఫలమైనట్లు తెలిసింది. జాతర జరిగిన బుధవారం–27, గురువారం–,80 శుక్రవారం–60 శనివారం– 30 గుడారాలు మాత్రమే బుకింగ్ అయినట్లు సంబంధిత శాఖ సిబ్బంది తెలిపారు. గుడారాల్లో రాత్రి పూట పడుకునే సమయంలో పొలాల్లోని మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డామని, ఆలయానికి సుదూరంగా గుడారాలను ఏర్పాటు చేయడంతో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని భక్తులు వాపోతున్నారు. పైగా జంపన్నవాగు సమీపంలో ఏర్పాటు చేయడంతో దర్శనానికి సాధారణ భక్తులతో పాటు కిలో మీటరుకు పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఏర్పాట్లు చాలా బాగున్నాయి..
భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఫొటో షూట్ చేసి అంతర్జాతీయ మీడియాకు అందిస్తున్నాం. మేడారంలో జాతర జరుగుతుందని తెలిసి అంతర్జాతీయ మీడియా తరుపున గత నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. టూరిజం శాఖ తరుపున కేటాయించిన లగ్జరీ గుడారాలు బాగున్నాయి. రెండు బెడ్లు, ఫ్యాన్, కూలర్లు సౌకర్యంగా ఉన్నాయి. మరుగుదొడ్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. టూరిజం గుడారాలు ఏర్పాట్లు పూర్తిగా నచ్చాయి.
– క్రిస్టియానా, జూలియట్ (బ్రెజిల్, జర్మనీ వాసులు)
ఇబ్బందులు పడ్డాం
అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో 12 గంటల పాటు ఉండడానికి రూ.1000 చెల్లించి బుకింగ్ చేసుకున్నాం. వీఐపీ భక్తులుగా బుక్ చేసుకున్నా వాహనాలు కన్నెపల్లి పార్కింగ్ ప్రాంతంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి గుడారాలకు సామగ్రిని మోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డాం. టూరిజం శాఖ తరుపున బుకింగ్ చేసుకున్న వారికి గుడారాల వరకు అనుమతి ఇచ్చిన అధికారులు, ఏకో టూరిజం గుడారాలను బుకింగ్ చేసుకున్న మాకు అనుమతి ఇవ్వలేదు.
– జీవన్ కుమార్, వరంగల్
పరుపులు లేక ఇబ్బంది పడ్డాం
అటవీశాఖ తరుపున గుడారాలను ఏర్పాటు చేశారని తెలిసి 24గంటల పాటు ఉండడానికి రూ.1500 చెల్లించి ప్రకటించిన ఫోన్ నెంబర్ అధారంగా గుడారాన్ని బుకింగ్ చేసుకున్నాం. గుడారంలో ఎనిమిదిమంది పడుకునే విధంగా సౌకర్యం ఉంది. కాకపోతే పడుకోవడానికి వీలుగా గుడారంలో పరుపులు ఏర్పాటు చేస్తే బాగుండేది. పొలాల్లో గుడారాలు ఉండడంతో మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డాం.
– గడ్డం శ్రీనివాస్,కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment