2025, జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేళాకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా జనం తరలిరానున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకశాఖ అధికారులు(Tourism officials) ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రయాగ్‌రాజ్ చారిత్రక వైశిష్ట్యాన్ని తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ టూర్ గైడ్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వెండర్లు, సెయిలర్లకు శిక్షణ అందిస్తున్నారు. వీరు కుంభమేళాకు తరలివచ్చే పర్యాటకులకు సహకారం అందించనున్నారు.
లక్నోలోని కాన్షీరామ్ టూరిజం మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు మరో సంస్థతో టూరిజం శాఖ ఎంవోయూ కుదుర్చుకుని ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నదని ప్రాంతీయ పర్యాటక అధికారి అపరాజిత సింగ్ చెప్పారు. పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకే ఈ శిక్షణా కార్యక్రమాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గైడ్ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల పాటు ఉంటుందని ట్రైనింగ్ డైరెక్టర్ ప్రఖర్ తివారీ తెలిపారు. ఈ గైడ్‌లకు ప్రథమ చికిత్స(First aid)పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణతో పాటు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులతో ఎలా ప్రవర్తించాలనేదానిపై కూడా పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత(Plastic-free) కుంభమేళాపై పర్యాటకులకు వివరించాలని అధికారులు శిక్షణార్థులకు తెలియజేస్తున్నారు. కాగా వివిధ విభాగాల్లో మొత్తం 4,200 మందికి శిక్షణ ఇవ్వాలని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 360 మంది సెయిలర్లు, 451 మంది ట్యాక్సీ డ్రైవర్లు, 871 మంది గైడ్‌లు ఇప్పటికే శిక్షణ పొందారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న వారికి ప్రజారోగ్యం, పరిశుభ్రత, సీపీఆర్‌పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ పుష్కర్ త్రిపాఠి తెలిపారు. మరోవైపు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. భరద్వాజ ఆశ్రమం కారిడార్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే ఆలోప్ శంకరి ఆలయం, పాండేశ్వర్ మహాదేవ్, మంకమేశ్వర్ ఆలయం, దశాశ్వమేధ ఆలయాలలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచారు.
ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment