సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి 12 ప్రాంతాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్‌లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి డిపీఆర్‌లు సిద్దం చేసినట్లు పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస రావు తెలిపారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పస్తామన్నారు. కోవిడ్ కారణంగా గత ఆరు నెలలలో రాష్ట్ర పర్యాటక శాఖ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రం సూచనల మేరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్క్ లు, మ్యూజియంలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. ఉడాకి పూర్వ వైభవం తీసుకువస్తామని, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోపు ఎన్ఎడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. (చదవండి: పర్యాటకానికి మరింత ఊతం)
రుషికొండలో బోటింగ్ పాయింట్‌ను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో విశాఖ జిల్లాల్లోని అయిదు చోట్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా బౌద్దారామాలనుని అభివృద్ది చేసి, పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాక ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బీచ్ టూరిజంలపై కూడా దృష్టి సారించామన్నారు. పర్యాటక కొత్త పాలసీ ప్రకారం టూరిజం ఆపరేటర్లు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment