జలపాతాల వద్ద పర్యాటకానికి ప్రాణం పోసేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. మంచిర్యాల జిల్లా కుంటాల, దానికి చేరువగా ఉన్న పొచ్చెర, భూపాలపల్లి జిల్లాలోని బొగత జలపాతాల వద్ద రోడ్లు, హోటల్, బస వసతులు కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధిపై నిర్ణయం తీసుకోనుంది. – సాక్షి, హైదరాబాద్
పదుల సంఖ్యలో ఉన్నా..
ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని జలపాతాల కూటమి సప్తాహం, ఇచ్చోడ సమీపంలోని గాయత్రి జలపాతం, నిర్మల్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న సహస్త్రకుండ్, గూడూరు సమీపంలోని భీమునిపాదం, నిర్మల్ సమీపంలోని కనకాయి.. ఇలా ఎన్నో జలపాతాలున్నా 2 నెలలకు మించి కనువిందు చేయటం లేదు. దీంతో ప్రస్తుతానికి వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 నుంచి 6 నెలలు నీటి ప్రవాహం ఉండే కుంటాల, పొచ్చెర, బొగత వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అనుమతులకు అటవీ శాఖ ససేమిరా..
జలపాతాల వద్దకు పర్యాటకులు వచ్చేందుకు వీలుగా వసతులు కల్పిస్తే జీవ వైవిద్యానికి ఇబ్బందిగా పరిణమిస్తుందని అటవీ శాఖ చెబుతోంది. అనుమతులిచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే బొగత, కుంటాల వద్ద రోడ్లు నిర్మించగా.. బొగత వద్ద వసతి గదుల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. దీన్ని అటవీ శాఖ వ్యతిరేకిస్తోంది. ‘దట్టమైన అడవుల్లో ఈ జలపాతాలుంటున్నాయి. జంతుజాలం, గిరిజన గూడేలకు కేంద్రాలవి. రోడ్లు, ఇతర వసతులు కల్పిస్తే జంతుజాలం, గిరిజన జీవనానికి ఇబ్బందవుతుంది. పర్యావరణానికి హాని చేసే చర్యలు సరికాదన్న అభిప్రాయం నేపథ్యంలో వసతుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది’ అని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు.
అది ఆదిమానవుల నెలవు
భూపాలపల్లి జిల్లా గద్దలచెర గుట్ట వద్ద మరో జలపాతం ఉంది. వందల అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతున్న తీరు అద్భుతంగా ఉంది. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆదిమానవులకు నెలవని తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ వారు వాడిన పనిముట్లు, నీళ్లు నిలిచేందుకు చేసుకున్న ఏర్పాట్ల ఆనవాళ్లు కనిపించాయి.
– సత్యనారాయణ, ఔత్సాహిక పరిశోధకుడు