బొర్రాగుహల్లో పర్యాటకుల తాకిడి
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి రమణీయత, సహజ సౌందర్యం సొంతమైన విశాఖకు పర్యాటకులు పోటెత్తారు. పచ్చదనం, లోయలు, కొండకోనలతో అలరారే మన్యం.. నగర అంచున ఉన్న సుందర సాగరతీరం అందాలను వీక్షించడానికి అసక్తి చూపారు. మునుపటి ఏడాది కన్నా అధికంగా పర్యాటకులు విశాఖను సందర్శించారు. 2017లో 2.12 కోట్ల మంది దేశీ పర్యాటకులు, 92 వేల మంది విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించారు. 2018లో దేశీ పర్యాటకుల సంఖ్య 2.37 కోట్లకు, విదేశీ పర్యాటకుల సంఖ్య 95 వేలకు పైగా చేరింది. అంటే 2017 కంటే 2018లో 12 శాతం మంది టూరిస్టులు అధికంగా విశాఖ వచ్చారన్నమాట!
ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు పర్యాటకుల సీజనుగా పరిగణిస్తారు. అలాగే వేసవి సీజను మే నెలలోనూ వీరి తాకిడి అధికంగా ఉంటుంది. 2017 మే నెలలో 18,08,126 మంది రాగా, 2018 మేలో దాదాపు 8 లక్షలు అధికంగా అంటే.. 26,09,703 మంది పర్యాటకులు సందర్శించారు. ఇక దసరా సీజనులోనూ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విశాఖ వస్తుంటారు. 2017 నవంబర్‌లో 21,55,168 మంది రాగా 2018 నవంబర్‌లో 23,40,319 మంది టూరిస్టులు వచ్చారు. ఏటా డిసెంబర్‌లో నిర్వహించే విశాఖ ఉత్సవ్‌కు కూడా టూరిస్టులు పోటెత్తుతుంటారు. 2017 డిసెంబర్‌లో 28,99,113 మంది విశాఖకు రాగా, 2018లో 12 లక్షల మంది అధికంగా 40,03,164 మంది సందర్శించారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఆ నెలలో మన్యానికి వచ్చే పర్యాటకులు ఒకింత తగ్గారు. 2017 సెప్టెంబర్‌లో 17,78,761 మంది రాగా 2018 సెప్టెంబర్‌లో 17,16,781 మందికి తగ్గారు. ఏజెన్సీలో పోలీసు బలగాలు మోహరించడంతో పర్యాటకులు అటువైపు వెళ్లడానికి వెనకడుగు వేయడంతో మునుపటి ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 62 వేల మంది తక్కువగా విశాఖను సందర్శించారు. అక్టోబర్‌లో తిత్లీ తుపాను ప్రభావంతో ఆశించిన స్థాయిలో టూరిస్టులు రాలేదు. 2017లో ఆ నెలలో 17,06,568 మంది రాగా, 2018లో 18,06,043 మంది వచ్చారు. అయితే నవంబర్‌కల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితిలో మార్పు రావడంతో మళ్లీ పర్యాటకుల సంఖ్య పుంజుకుంది. 2017 నవంబర్ కంటే 2018 నవంబర్‌లో దాదాపు 2 లక్షల మంది అధికంగా సందర్శకులు విశాఖలో పర్యటించారు.
స్వల్పంగా పెరిగిన విదేశీ పర్యాటకులు
మరోవైపు విశాఖను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య స్వల్పంగానే పెరిగింది. 2017లో 92,958 మంది విశాఖలో పర్యటించగా 2018లో 95,759 మంది విదేశీయులు సందర్శించారు. స్వదేశీ పర్యాటకుల పెరుగుదల 12 శాతం ఉండగా విదేశీ పర్యాటకుల వృద్ధి మూడు శాతం మాత్రమే ఉంది. 2018లో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్య, తిత్లీ తుపాను ప్రభావం వల్ల విశాఖ వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిందని, లేనిపక్షంతో మునుపటి ఏడాదితో పోల్చుకుంటే 15 శాతానికి పైగా పర్యాటకుల పెరుగుదల ఉండేదని పర్యాటకశాఖ అధికారులు ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment