ఎంపీకి చేదు అనుభవం
అంబేద్కర్‌కు అవమానంపై దళితుల నిరసన
వెలిచేరు(ఆత్రేయపురం) : అభివృద్ధి కార్యక్రమాలకు తొలిసారి కొత్తపేట నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వెలిచేరులో అంబేద్కర్ విగ్రహం వేలు విరిచి 20 రోజులైనా ఎందుకు స్పందించ లేదంటూ దళితులు నిలదీయడంతో ఎంపీ ఖిన్నులయ్యారు. ఆత్రేయపురం మండలం వెలిచేరులో రూ.5 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్ బీ రహదారి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం ఎంపీ పండుల రవీంద్రబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వచ్చారు. ఆ సందర్భంగా స్థానిక దళిత నాయకులు, యువకులు ఒక్కసారిగా ఎంపీపై విరుచుకుపడ్డారు. కొంతసేపటికి తేరుకున్న ఎంపీ రవీంద్రబాబు స్పందిస్తూ అంబేద్కర్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. అంబేద్కర్ విగ్రహనికి గొడుగు, విగ్రహ అభివృద్ధి చేయిస్తామని హామీ ఇవ్వడంతో దళితులు శాంతించారు.
సీఐని ప్రశ్నించిన ఎమ్మెల్యే
అంబేద్కర్ విగ్రహ అవమాన సంఘటనపై పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటో తెలియచేయాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావుపాలెం ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసబాబును ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని సీఐ వివరణ ఇచ్చారు.
పార్టీ జెండాలపై వివాదం
తొలుత టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎంపీ, ఎమ్మెల్యేలకు మద్దతుగా పార్టీ జెండాలతో కార్యక్రమానికి హాజరుకావడంతో కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అనుకూలంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై తొలుత అభ్యంతరం తెలిపిన టీడీపీ నాయకులే పార్టీ జెండాలతో మెర్లపాలెం నుంచి ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు జిందాబాద్ అని నినాదానాలతో రావడంతో ఇరుపార్టీ నేతల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పనులు ప్రారంభించకుండా వెళ్లిపోయేందుకు ఎంపీ ప్రయత్నించారు. అధికారులు, ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసబాబు నచ్చచెప్పడంతో ఎంపీ రోడ్డు పనులు ప్రారంభిం చారు. అనంతరం అర్‌అండ్‌బీ అధికారుల అవగాహన సదస్సు జరిగింది.
జెడ్పీటీ సీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి బంగారం, ఎంపీపీ వాకలపూడి వెంకట కృష్ణారావు, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, మాజీ ఎంపీపీ పీఎస్ రాజు, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నేతలు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మార్గన గంగాధరం, నేతలు చిలువూరి బాబిరాజు, కునాధరాజు రంగరాజు, వేణు, అప్పారి విజయ్, ఎం. వీరభద్రరావు, కర్రి నాగిరెడ్డి, తమ్మన శ్రీను, చల్లా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.