సాక్షి, బెంగళూరు: కన్నడనాట దళితుల పరిస్థితి విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యంగా ఉన్న దళిత నాయకులు, తమతమ పార్టీల విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దళిత నేతలది కీలక పాత్ర అయినా వారు అందలానికి చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు కర్ణాటక చరిత్రలో ఒక్క దళిత సీఎం లేరు.
తొలినాళ్లలో వివక్షకు, అణచివేతకు గురైన దళితులు, రైతుల హక్కుల కోసం 1970, 1980 దశకాల్లో ఉద్యమాలు జరిగాయి. దీంతో ఆయా వర్గాల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. రానురాను రాష్ట్రంలో దళిత నేతలు ఆవిర్భవించారు. వి.శ్రీనివాస ప్రసాద్, హెచ్‌సీ మహదేవప్ప, కేహెచ్ మునియప్ప, బి.సోమశేఖర్, గోవింద్ కారజోళ, రమేష్ జిగజిణగి వంటి దళిత నేతలు బాగా రాణించారు. వీరందరిలో ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అగ్రగణ్యులుగా పేరుపొందారు.
26 శాతం జనాభా ఉన్నా...
రాష్ట్ర జనాభాలో 26 శాతం ఉన్న దళితులను సంఘటితం చేయడంలో ఆయా నేతలు విఫలమయ్యారు. దీంతో ఏ దళిత నాయకుడూ సీఎం కాలేకపోయారు. దీంతో ఎన్నికల్లో, రాజకీయాల్లో ఆధిపత్య పోరు సాగింది. ఎవరికివారే బలమైన నాయకులుగా ఎదిగినా అంతర్గత కలహాల వల్ల సీఎం కాలేకపోయారు. దళిత సంఘర్ష సమితి వ్యవస్థాపకుడు బి.క్రిష్ణప్ప దళితుల హక్కుల కోసం పోరాడారు. దేవనూరు మహాదేవ్, సిద్ధలింగయ్య, చంద్రప్రసాద్ త్యాగి వంటి దళిత రచయితలు తమ సాహిత్యం ద్వారా దళితుల్లో చైతన్యం కలిగించారు.
జనతా పరివార్ నుంచి బి.రాచయ్య అనే దళిత నేత మంత్రివర్గంలోని అన్ని పదవులనూ అలంకరించినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోలేకపోయారు. పార్టీలో చీలిక వచ్చిన సమయంలో ఎస్‌ఆర్ బొమ్మై కారణంగా ముఖ్యమంత్రి పదవి త్రుటిలో చేజారింది. కాంగ్రెస్ మరో మాజీ నేత కేహెచ్ రంగనాథ్ కూడా అన్ని శాఖల మంత్రిగా పనిచేయడంతోపాటు, కేపీసీసీ అధ్యక్షుడిగానూ రెండుసార్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు నడపలేక ఆయనకు సీఎం పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
గత ఎన్నికల్లో అనూహ్యంగా చేజారింది
ఎస్‌ఎం కృష్ణ మంత్రివర్గంలో దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. 2006లో ఖర్గే కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ 2008 ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో దళిత నాయకుడు జి.పరమేశ్వర్‌ను కేపీసీసీ అధ్యక్షుణ్ని చేయగా 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అయితే ఆ ఎన్నికల్లో పరమేశ్వర్ ఘోరంగా ఓడిపోవడంతో ఆయనకు సీఎం పదవి దక్కలేదు. ఇప్పటి సీఎం సిద్ధరామయ్యను ఆ పీఠం వరించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మల్లికార్జునఖర్గేను సీఎం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment