సాక్షి, న్యూఢిల్లీ : యావత్ భారత దేశం ఉత్కంఠతో ఎదురు చూసిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. అత్యధిక స్థానాలు సాధించి బీజేపీ తొలిస్థానంలో, కాంగ్రెస్, జేడీఎస్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీకి తక్కువ ఓట్లు పోలవగా, రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు లభించాయి. మొత్తం 224 స్థానాలకు గాను 222 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, 104 స్థానాలు కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలిచిన బీజేపీకి మొత్తంగా 36.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 78 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా 38 శాతం ఓట్లు సాధించుకోగలిగింది. బీజేపీకన్నా రెండు శాతం ఓట్లు కాంగ్రెస్ కు అధికంగా రావడం గమనార్హం. ఇకపోతే, 37 సీట్లు సాధించుకుని మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్ కేవలం 18.3 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. గంట గంటకూ మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య తక్కువ ఓట్లు, తక్కువ సీట్లు సాధించుకున్న జేడీఎస్ పంట పండుతోంది. ఇలావుండగా, మొత్తం పోలైన ఓట్లలో ఏ పార్టీకి కూడా ఓటు వేయడం ఇష్టంలేదని చెప్పడానికి ఒక శాతం ఓట్లు నోటాకు పోలయ్యాయి.
అయితే దేశంలో రాజకీయ పార్టీలకు ఓ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎక్కువచ్చి సీట్ల తక్కువ రావడం అరుదైనప్పటికీ కొత్తేమి కాదు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన పలు చోట్ల ఈసారి బీజేపీ విజయం సాధించడం విశేషం. కర్ణాటక కోస్తా, మల్నాడ్ ప్రాంతంలో బీజేపీ ఈసారి అద్భుత విజయాన్ని సాధించింది. ఒక్క కోస్తా ప్రాంతంలోనే 21 సీట్లకుగాను, 18 సీట్లలో బీజేపీ విజయఢంకా మోగించింది.
Published Tue, May 15 2018 12:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment