మహబూబ్‌నగర్: రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈసారి విజయం ఖాయమని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని హస్తం అగ్రనేతలు చేస్తున్న సూచనలు మాటలుగానే మిగులుతున్నాయి. వనపర్తి, గద్వాల జిల్లాకేంద్రాల్లో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
బూత్ లెవల్‌లో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు పరిశీలకుల సమక్షంలో నిర్వహించిన సమావేశాల్లో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇరువర్గాల మాటల తూటాలు, కుమ్ములాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత–కొత్త నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. వారిని సముదాయించలేక అబ్జర్వర్లు తలపట్టుకున్నారు.
వనపర్తిలో తోపులాట..
వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి అనుచరులు, యువజన కాంగ్రెస్ నాయకుల మధ్య మొదటి నుంచీ వార్ నడుస్తోంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న ఘటనలు ఇదివరకే ఉన్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలో వనపర్తి శాసనసభ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించగా.. కాంగ్రెస్ కేంద్ర కమిటీ నుంచి అబ్జర్వర్‌గా పీవీ మోహన్‌తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ క్రమంలో మండల తదితర కమిటీల్లో ప్రాతినిధ్యం తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఉన్న తన మండలంలో ఇది వరకే ఏర్పాటు చేసిన యువజన కమిటీ ఉండగా.. తనకు తెలియకుండా చిన్నారెడ్డి మరో కమిటీని ఏర్పాటు చేయడంపై శివసేనారెడ్డి ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలు కాగా.. తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తమ మండలంలోని కమిటీల్లో కూడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఇటీవల పార్టీలో చేరిన మేఘారెడ్డి వర్గీయులు సైతం ప్రశ్నించడంతో వాగ్వాదం మరింత పెరిగింది.
చిన్నారెడ్డి ఒంటెత్తు పోకడలు అవలంబిస్తున్నారని.. నియోజకవర్గవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కమిటీలను తన ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్నారని యూత్ కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగగా.. చిన్నారెడ్డి అనుచరులు అడ్డు తగిలి, జై చిన్నా అంటూ నినాదాలు చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. బాహాబాహీకి దిగిన ఇరువర్గాలు నినాదాలతో హోరెత్తించడంతో.. వారిని మల్లురవి సముదాయించి పంపించి వేయడంతో పాటు సమావేశం వాయిదా వేశారు.
గద్వాలలో మాటకు మాట..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిశీలకుడు మోహన్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు హాజరు కాగా.. ఆ పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి కుర్వ విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు దుమారం లేపాయి. కష్టపడి పనిచేసే వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీకి క్రమశిక్షణ ఉందని.. ఒంటెత్తు పోకడలకు పోతూ పాత నాయకులు, డీసీసీ అధ్యక్షులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, తగిన బుద్ధి చెబుతామంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నామని.. నిన్న, మొన్న వచ్చిన నాయకులు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ఏకపక్షంగా ప్రచారం చేసుకుంటున్నారని.. పరోక్షంగా బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై సరిత సైతం దీటుగా స్పందించింది.
ప్రతిసారి పాత వాళ్లం అని చెప్పే నాయకులు పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోయారు.. తాము కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పార్టీలో చేర్పిస్తూ బలోపేతం చేస్తున్నామని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించమని.. పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తామని.. తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని ఎక్కడా అనలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment