మహబూబ్‌నగర్: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలపై ఇది వరకే వివిధ సంస్థలతో పలు దఫాలుగా సర్వేలు చేపట్టాయి.
ఇందులో వచ్చిన ఫలితాలను పరిశీలించిన ఆయా పార్టీల అధిష్టానాలు ఎన్నికల పోరుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో దూకుడు పెంచగా.. ఈసారి సత్తా చాటాలనే సంకల్పంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కార్యాచరణను వేగవంతం చేశాయి.
ఇందులో భాగంగా ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే పలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి ఈ నెలాఖరులోపే తొలి జాబితా వెల్లడికానున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుండడంతో ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆయా పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment