దేవరకద్రలో కారు తనిఖీ చేస్తున్న పోలీసులు
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి రూ.1,11,96,570 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధితోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.99,61,370 నగదు సీజ్ చేశారు.
ఇందులో మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ సైదులు ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ ఏరియాలో తనిఖీలు జరపగా ద్విచక్రవాహనంపై బ్యాగ్‌లో ఉదయ్‌కుమార్, రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.28,73,000 తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. అలాగే రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం రూ.18,26,670, చిన్నచింతకుంట పోలీసులు లాల్‌కోట చౌరస్తాలో రూ.35,49,900, దేవరకద్ర పోలీసులు రూ.17,11,800 నగదు స్వాధీనం చేసుకుని కమిటీకి అప్పగించనున్నారు.
అలాగే టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సంజయ్‌నగర్, కొత్త చెరువు రోడ్, హనుమాన్‌నగర్ ఏరియాల్లో బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురి ఇళ్లలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండగా 60 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
నారాయణపేట జిల్లా మద్దూరులోని ఓ సినిమా థియేటర్ దగ్గర కారును తనిఖీ చేయగా దామరగిద్ద మండలాలనికి చెందిన అయ్యవారిపల్లి బాల్‌రెడ్డి, దూదేపల్లికి చెందిన వ్యక్తి వాహనంలో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కమిటీకి అప్పగిస్తామని కోస్గి సీఐ జనార్దన్ తెలిపారు.
మరికల్‌లోని ఆత్మకూర్ ఎక్స్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబ్‌నగర్ నుంచి నర్వ వెళ్తున్న వెంకటరాజు కారులో రూ.3 లక్షలు, దేవరకద్ర నుంచి రాయిచూర్ వెళ్తున్న శ్రీశైలం కారులో రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. అలాగే ఎలిగండ్లకు చెందిన శేఖర్‌గౌడ్ రూ.19 వేల విలువ గల మద్యం ఆటోలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో దాసుపల్లికి చెందిన జంగిరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వస్రుంనాయక్ తలిపారు. ఇందుకు సంబంధించి పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించామని పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.1.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రక్షితాకె.మూర్తి తెలిపారు. అలాగే ఆత్మకూరు, రేవల్లి, పెబ్బేరు, గోపాల్‌పేట, వనపర్తి టౌన్ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలో నిల్వ చేసిన 191 లీటర్ల మద్యంను సీజ్ చేశామన్నారు. శ్రీరంగాపురం మండలంలోని నాగరాలలో బెల్టు షాపుపై దాడి చేసి 11 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటస్వామి చెప్పారు.
మక్తల్ సీఐ రాంలాల్, ఎస్‌ఐ పర్వతాలు మండలంలోని చందాపూర్ శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా రవికుమార్ అనే వ్యక్తి కారులో రూ.2 లక్షలు, ఎదిర కిరణ్‌కుమార్‌కు చెందిన కారులో రూ.1.29 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు.
దామరగిద్ద మండలంలోని కాన్‌కుర్తి చెక్‌పోస్టు దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా మోదేపల్లికి చెందిన వ్యాపారి రంజిత్‌కుమార్ నుంచి రూ.1.57 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు చెప్పారు. అలాగే మరికల్‌కు చెందిన వ్యాపారి రాజు నుంచి రూ.1.85 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment