సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొనగా, అదే సమయంలో పార్టీలోని ముఖ్య నేతల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఇటీవల పార్టీలోకి చేరిన నేతలు తమకే టికెట్ వరిస్తుందనే ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. గురువారం జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం నుంచి టికెట్ ప్రకటన వెలువడ్డాక ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కూచుకుళ్ల కుటుంబంపై నాగం విమర్శనాస్త్రాలు..
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలసి నాగం జనార్దన్‌రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ వేదికగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిపై విమర్శలను సంధించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరకుండానే పార్టీ టికెట్ అడగడాన్ని తప్పుబట్టారు.
మళ్లీ తనను ఓడించేందుకే దామోదర్‌రెడ్డి కుమారుడిని పార్టీలోకి పంపారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ నుంచి నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చాల్సిందిపోయి.. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే చీలికలు తెస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన అసలు శక్తి చూపుతానని, చక్రం తిప్పుతానంటూ నాగం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.
వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు..
నాగర్‌కర్నూల్‌తో పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పార్టీ అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమాలను సైతం ఎవరికి వారే సొంతంగా చేపడుతున్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నేతలు జగదీశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇరువురూ బరిలో ఉంటామని చెబుతుండటంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
కొల్లాపూర్‌లో ఎవరికి వారే..
కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య సఖ్యత పొసగడం లేదు. ఎవరికి వారు తమకే పార్టీ టికెట్ లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. వేర్వేరుగా ప్రజల మధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు. పార్టీ టికెట్‌పై సాగుతున్న ప్రచారం నేపథ్యంలో శుక్రవారం జగదీశ్వరరావు స్పందించారు. ఈసారి ఎన్నికల్లో కాాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని, తాను ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment