
సాక్షి, విజయవాడ: దళితులకు స్థానంలేని అమరావతి తమకు రాజధానిగా వద్దంటూ ఐక్య దళిత మహానాడు నాయకులు ధర్నాకు దిగారు. స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా, ఐక్య దళిత మహనాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్‌ఎస్టేట్ రాజధానిగా మార్చేశారని మండిపడ్డారు. ఆయన సామాజికవర్గం భూములు కొన్నచోటే రాజధాని ప్రకటించి, రైతుల వద్ద నుంచి భూములు లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి లో జరిగే ఉద్యమాలు చంద్రబాబు ప్యాకేజీ ఉద్యమాలు అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ఇందుకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు.
అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ప్రకటించారని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కల్లూరి చెంగయ్య ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం వల్లనే రాష్ట్రం విడిపోయింది. పేదల సంక్షేమానికి అడ్డు పడే వ్యక్తి ఆయన. దళితులను కేవలం ఓటుబ్యాంకుగా భావించే వ్యక్తి. దళిత ద్రోహి. దళిత బిడ్డలు చదువుకునే 6 వేల ప్రభుత్వ పాఠశాలలు చంద్రబాబు మూసివేయించారు. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు’’ అని చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment