Kalluri Chengaiah
-
3 రాజధానులకు మద్దతు: దళిత నాయకులు
సాక్షి, విజయవాడ: దళితులకు స్థానంలేని అమరావతి తమకు రాజధానిగా వద్దంటూ ఐక్య దళిత మహానాడు నాయకులు ధర్నాకు దిగారు. స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా, ఐక్య దళిత మహనాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ఎస్టేట్ రాజధానిగా మార్చేశారని మండిపడ్డారు. ఆయన సామాజికవర్గం భూములు కొన్నచోటే రాజధాని ప్రకటించి, రైతుల వద్ద నుంచి భూములు లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి లో జరిగే ఉద్యమాలు చంద్రబాబు ప్యాకేజీ ఉద్యమాలు అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ఇందుకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ప్రకటించారని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కల్లూరి చెంగయ్య ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం వల్లనే రాష్ట్రం విడిపోయింది. పేదల సంక్షేమానికి అడ్డు పడే వ్యక్తి ఆయన. దళితులను కేవలం ఓటుబ్యాంకుగా భావించే వ్యక్తి. దళిత ద్రోహి. దళిత బిడ్డలు చదువుకునే 6 వేల ప్రభుత్వ పాఠశాలలు చంద్రబాబు మూసివేయించారు. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు’’ అని చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. -
వంద గొడ్లను తిన్న రాబందు కాశీయాత్ర చేసినట్లుంది
సాక్షి, అమరావతి: దళితులపై జరుగుతున్న దాడుల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, చెబుతున్న నీతులు వంద గొడ్లను తిన్న రాబందు కాశీయాత్ర చేసినట్లు ఉందని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో దళితులను అనేక రకాలుగా వేధించినప్పుడు కనీస చర్యలకు ఆదేశించని బాబు.. నేడు దళితుల పట్ల ఆవేదన చెందటం హాస్యాస్పదమేనన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సొంత జిల్లా ముంగిలిపట్టులో ఓ దళిత వృద్ధ మహిళను చెప్పులతో కొట్టారు. ► శాంతిపురం (కుప్పం)లో మహిళను వివస్త్రను చేశారు. ► తొట్టంబేడులో ఓ మహిళను కొట్టి చంపారు. ► రాజుల కండ్రిగ, కృష్ణమనాయుడు కండ్రిగ, పశ్చికాపల్లిలో దళితులను వెలిపెట్టారు. ► రామాపురం (నెల్లూరు)లో 40 మంది దళితులను తప్పుడు కేసులతో జైలుకు పంపారు. ► టీడీపీ జెండా కాల్చారని చుండూరు దళిత యువకులను పోలీస్ స్టేషన్లో చావ బాదారు. ► దళితులైన నాయుడుపేట మునిసిపల్ చైర్పర్సన్ శోభారాణి, కడప జడ్పీ చైర్మన్ గూడూరు రవిలకు సమావేశాల్లో కుర్చీలు ఇవ్వకుండా నిలబెట్టారు. ► 6 వేల ప్రభుత్వ పాఠశాలలు, వందలాది ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు మూసేశావు. -
టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలి
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళితులపై వివక్ష చూపుతున్న టీడీపీ నుంచి ఎస్సీలు బయటకు వచ్చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పిలుపునిచ్చారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భారీ నీటిపారుదల, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖలు దళితులకు కేటాయించారని, చంద్రబాబు మంత్రివర్గంలో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం కొరవడిందన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులతో పాటు, రాజ్యసభ సీట్లను అగ్రవర్ణాలకే కేటాయించారని గుర్తు చేశారు. టీడీపీ పోలిట్‌బ్యూరో నుంచి ఎంపీ శివప్రసాద్‌ను సైతం తొలగించారన్నారు. కాపుల మెప్పు కోసం పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన మండలిలో పార్టీ నాయకులను నామినేట్ చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తీసుకురావడం వల్లే గిరిజన సలహా మండలి నియమించారన్నారు. -
'ఏపీ ప్రభుత్వానిది దగాకోరు బాట'
⇒ దళితులను మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ⇒ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య విజయవాడ (గుణదల): ప్రభుత్వం తలపెట్టిన దళితబాట దగాకోరు బాటగా మారిందని, దళిత ప్రజలను మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంచిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళిత నిరుద్యోగులను మభ్యపెట్టడానికి, చంద్రబాబు పాలనపై దళితులలో వస్తున్న అసంతృప్తిని అణచివేయటానికి పన్నిన కుట్రే చంద్రన్నబాటని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో దళిత వర్గాలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో చెంగయ్య ధ్వజమెత్తారు. మూడు సెంట్లు భూమి, పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు పూచీకత్తులేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు, భూమి కొనుగోలు పథకం అమలు కావటం లేదని, అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వటంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. పరిశ్రమల పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ దళితుల నుంచి బలవంతంగా తీసుకున్న లక్షా 20 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకు ప్రణాళికలు కూడా రూపొందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చైర్మన్లను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కేవలం ఎస్సీ రుణాలు మంజూరు పేరుతో ప్రచారం చేసుకుని సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని కల్లూరి చెంగయ్య ఆరోపించారు. -
'చంద్రబాబు నిర్లక్ష్యం మళ్లీ రుజువైంది'
⇒ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య కాకినాడ : కోనసీమలో దళితులను అమానుషంగా హింసించి గాయపర్చిన సంఘటన జరిగి రెండు వారాలవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు విచారకరమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు వెంకటేశ్వరరావును గురువారం పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియూతో మాట్లాడుతూ.. కేవలం రూ.లక్ష పరిహారాన్ని చంద్రబాబు పంపించి చేతులు దులుపుకోవడం దళితుల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యాన్ని మరోమారు రుజువు చేసుకున్నారని విమర్శించారు. రాజమండ్రి వరకు వచ్చిన సీఎం అమలాపురానికి ఎందుకు రాలేకపోయారని, గుజరాత్ ఘటనను పోటీలు పడి ఖండించిన టీడీపీ నేతలు, మంత్రులు నేడు ఏమయ్యారని ప్రశ్నించారు. దాడి కేసులో ఎ-1 ముద్దాయిగా ఉండాల్సిన వ్యక్తిని 8వ ముద్దాయిగా చూపడం చూస్తుంటే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తక్షణం బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సేవ్దళిత్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేపట్టి ఉద్యమాన్ని ఉదృ్ధతం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో గ్రామ బహిష్కరణలు నేటికీ జరుగుతున్నాయన్నారు. పదిరోజుల కందట అదే జిల్లా పచ్చికాపల్లం గ్రామంలో ధర్మరాజుల తిరునాళ్ళలో దళితులను బహిష్కరిస్తే నేటికీ బాధ్యులను అరెస్ట్ చేయలేదని, నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో సాక్షాత్తు సీఎం బంధువులు ఎస్సీ, ఎస్టీల భూమిని ఆక్రమించి, మహిళలపై అమానుషంగా దాడిచేస్తే వారిపై శిక్షించలేదని చెంగయ్య ఈ సందర్భంగా గుర్తుచేశారు.