⇒ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య
కాకినాడ : కోనసీమలో దళితులను అమానుషంగా హింసించి గాయపర్చిన సంఘటన జరిగి రెండు వారాలవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు విచారకరమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు వెంకటేశ్వరరావును గురువారం పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియూతో మాట్లాడుతూ.. కేవలం రూ.లక్ష పరిహారాన్ని చంద్రబాబు పంపించి చేతులు దులుపుకోవడం దళితుల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యాన్ని మరోమారు రుజువు చేసుకున్నారని విమర్శించారు.
రాజమండ్రి వరకు వచ్చిన సీఎం అమలాపురానికి ఎందుకు రాలేకపోయారని, గుజరాత్ ఘటనను పోటీలు పడి ఖండించిన టీడీపీ నేతలు, మంత్రులు నేడు ఏమయ్యారని ప్రశ్నించారు. దాడి కేసులో ఎ-1 ముద్దాయిగా ఉండాల్సిన వ్యక్తిని 8వ ముద్దాయిగా చూపడం చూస్తుంటే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తక్షణం బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సేవ్‌దళిత్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేపట్టి ఉద్యమాన్ని ఉదృ్ధతం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో గ్రామ బహిష్కరణలు నేటికీ జరుగుతున్నాయన్నారు. పదిరోజుల కందట అదే జిల్లా పచ్చికాపల్లం గ్రామంలో ధర్మరాజుల తిరునాళ్ళలో దళితులను బహిష్కరిస్తే నేటికీ బాధ్యులను అరెస్ట్ చేయలేదని, నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో సాక్షాత్తు సీఎం బంధువులు ఎస్సీ, ఎస్టీల భూమిని ఆక్రమించి, మహిళలపై అమానుషంగా దాడిచేస్తే వారిపై శిక్షించలేదని చెంగయ్య ఈ సందర్భంగా గుర్తుచేశారు.