అరుణ మృతదేహాన్నిపరిశీలిస్తున్న ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి, ఇన్‌సెట్లో అరుణ (ఫైల్)
పట్నంబజారు(గుంటూరు): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం ఎస్‌ఐ గోపు శివకృష్ణారెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు నగరంలోని రెడ్డి కళాశాల సమీపంలోని మల్లారెడ్డినగర్‌లో నివాసం ఉండే మాదల అరుణ (34)ను సాంబశివరావు అనే వ్యక్తికి ఇచ్చి 2006లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే వివామమైన తొలినాళ్లలో జీఎంసీలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేసిన సాంబశివరావు గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నాడు. పెళ్లయిన కొద్ది నెలలకే అరుణకు ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. సాంబశివరావుకు ఉద్యోగం లేకపోవటం, మద్యానికి బానిసగా మారటంతో కుటుంబ పోషణ భారం అరుణపై పడింది. కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ..కుటుంబాన్ని లాక్కువచ్చేది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగుతుండేవని బంధువులు చెబుతున్నారు.
సాంబశివరావు నిత్యం అరుణను అనుమానించేవాడని, మద్యం తాగి వచ్చి ఆమెను అనేకమార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. నిత్యం ఆమెను ఉద్యోగం మానేయాలని వేధిస్తుండేవాడని తెలిపారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ సుమారుగా పదిరోజుల క్రితం ఏటీ అగ్రహారంలో ఉన్న సొంత నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విధులకు వెళ్లవద్దంటూ..గుర్తింపు కార్డులు కూడా తగలబెట్టడంతో, గత వారం రోజులుగా మృతురాలు ఉద్యోగానికి కూడా వెళ్లటంలేదని తెలిసింది. ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరగటంతో, సాంబశివరావు ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయారు. తాను చనిపోతానంటూ తిరిగి రాత్రి ఒంటిగంట సమయంలో తిరిగి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చారు. తిరిగి ఉదయం లేచి బయటకు వెళ్లి వచ్చిన సాంబశివరావు అరుణ మృతి చెంది ఉండటాన్ని గమనించారు. దీంతో విషయాన్ని బంధువులు, పోలీసులకు తెలియజేశారు.
మృతిపై ఎన్నో అనుమానాలు...
ఘటనాస్థలంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడిన దాఖలాలు ఏ మాత్రం కనపడటం లేదని, ఎలా మృతి చెందిందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వెళ్లిన సాంబశివరావు అప్పుడు భార్య అరుణ బాగానే ఉన్నట్టు పోలీసులకు చెబుతున్నాడు. సాంబశివరావు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఏమైనా ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భర్త సాంబశివరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి సోదరుడు తోట రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment