![Housewife died under suspicious circumstances in Yanam - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/22/married.jpg.webp?itok=ArLVxfwc)
ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మీభవాని
సాక్షి, యానాం: పట్టణ పరిధిలోని మెట్టకూరు గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక సాయికాలనీలో నివాసం ఉంటున్న వివాహిత దంగేటి లక్ష్మీభవాని(20) బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఆమె భర్త, ఆర్‌ఎంపీ వైద్యం చేసే దంగటి వరప్రసాద్ నిద్రమాత్రలు మింగడంతో అతను స్థానిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
యానాం మెట్టకూరు సాయికాలనీకి చెందిన దంగేటి వరప్రసాద్‌కు గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన లక్ష్మీభవానికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారై ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. మృతదేహాన్ని యానాం జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు.
ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు
వరప్రసాద్ తండ్రి సూర్యనారాయణ, తల్లి బేబీలే తన కుమారై లక్ష్మీభవాని మృతికి కారకులని మృతురాలి తల్లి అరుణ బుధవారం విలేకరుల వద్ద ఆరోపించింది. తన కుమారైను ముందుగా చంపేసి తరువాత ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని, ఆర్‌ఎంపీ వైద్యుడిగా ఉన్న వరప్రసాద్ స్లీపింగ్ టాబ్లెలెట్స్ మింగినట్లు నటిస్తున్నాడని ఆరోపించింది.
అనుమానిస్తూ రోజూ తనను కొడుతున్నారని లక్ష్మీభవాని ఫోన్‌లో చెప్పేదని అయితే సర్దుబాటు చేసుకుంటారని భావించామని చెప్పింది. గొడవలపై పెద్దల సమక్షంలో ఇటీవల అంగీకారం కుదరడంతో మూడు నెలల క్రితమే గోకవరం మండలం కొత్తపల్లి నుంచి కాపురానికి తన కుమారై యానాం వచ్చిందని అంతలోనే ఘోరం జరిగిందన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment