విష్ణుప్రియ(ఫైల్)
బనగానపల్లె(నంద్యాల జిల్లా): అందరి ఆడ పిల్లల్లాగే ఓ అమ్మాయి ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. కొన్నాళ్లకే ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వేధింపులు మరింత అధికమయ్యాయి. మగ పిల్లవాన్ని కనలేదని పుట్టింటికి తరిమేశారు. పెద్దలు పంచాయితీ చేసి భర్త వద్దకు పంపగా శనివారం విగతజీవిగా మారింది. కడుపు నొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు బుకాయిస్తుండగా.. తమ కూతురిని తాడుతో గొంతు బిగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చదవండి: వేరే మహిళలతో భర్త వివాహేతర సంబంధం.. భార్య షాకింగ్ నిర్ణయం
పట్టణంలోని ఎరుకలిపేటకు చెందిన విష్ణుప్రియ(26) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని అల్‌మాస్‌పేటకు చెందిన సుధాకర్, బిజ్జమ్మ దంపతుల కూతురు విష్ణుప్రియను బనగానపల్లె పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు, దేవి కుమారుడు విజయ్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు నాలుగేళ్ల గీత, రెండేళ్ల దక్షత ఉన్నారు.
అయితే పెళ్లైన రెండు నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామ వేధింపులు ప్రారంభించారు. దీంతో మరో నాలుగు తులాల బంగారం ఇచ్చి పెద్ద మనుషుల వద్ద పంచాయితీ చేసి కూతురిని మరోసారి అత్తారింటికి పంపారు. అయితే ఇద్దరు ఆడపిల్లలు కావడంతో మగ పిల్లవాని కోసం మరో వివాహం చేసుకుంటానని భర్త విజయ్ భార్యను వేధించేవాడు. ఇదే విషయమై శనివారం ఉదయం భార్య, భర్త గొడవ పడ్డారు. కాసేపటికే విష్ణుప్రియ విగతజీవిగా మారింది. గొంతుకు తాడుతో బిగించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment