
గోపి మృతదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేతలు మృతి చెందిన గోపి(ఫైల్ )
గుంటూరు, మంగళగిరి: నెపం వేశారు..అవమానించారు.. చిత్రహింసలు పెట్టారు.. ఇవన్నీ భరించలేని యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ... ఎందుకు చేసుకుంటున్నాడో వివరంగా సెల్ఫీ వీడియో తీసి మరీ మృతి చెందాడు. పోయిన బంగారం దొరికింది.. నెపం వేసిన వారు బాగానే ఉన్నారు.. ఆ నెపం భరించలేక మృతి చెందిన యువకుడి ప్రాణాలు తిరిగివస్తాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో ముసిరాజు గోపి(22) అనే యువకుడు తాను చేయని నేరాన్ని తనపై మోపి, పోలీసులు హింసకు గురిచేశారన్న అవమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గోపి సెల్ఫీ వీడియోపై ఎలాంటి విచారణ చేయని పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి బుధవారం ఉదయం హడావుడిగా మృతదేహానికి పంచనామా నిర్వహించారు.
అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చి ఆగమేఘాలపై అంత్యక్రియలు చేయించారు. అదే రోజు రాత్రి గోపి తల్లి లక్ష్మి మాట్లాడుతూ అధికార పార్టీ నేత ఒత్తిడి కారణంగానే తమను పోలీసులు వేధించారని, పోలీసుల వేధింపులతో పాటు కాలనీలో అవమానం తట్టుకోలేక తన కుమారుడు మృతి చెందాడని తెలిపింది. గోపి మృతికి కారణమైన సెల్ఫీవీడియో బయటకు రావడం, తల్లి అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడంతో కలవరపడిన టీడీపీ నేతలు, పోలీసు అధికారులు రాత్రంతా గోపి కుటుంబసభ్యులను బెదిరించి రూ.8 లక్షలకు సెటిల్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు చోరీకి గురైన బంగారు నగలు లభ్యమయ్యాయి. ఈ విషయమై సీఐ హరికృష్ణను వివరణ కోరగా కేసుతో గోపికి ఎలాంటి సంబంధం లేదని, తాము గోపిని చిత్రహింసలు పెట్టలేదన్నారు. తొందరపాటు చర్యతోనే గోపి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్నారు. గోపి మృతిచెందడంతో ఆందోళనలో ఉన్న తల్లి లక్ష్మిని కొందరు రెచ్చగొట్టడం కారణంగానే పోలీసులపై ఆరోపణలు చేసినట్టు ఆమె బుధవారం చెప్పిందన్నారు. గోపి మృతి విషయంలో ఎలాంటి సెటిల్‌మెంట్ జరగలేదని, చట్టప్రకారమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గోపి మృతదేహం వద్ద బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకులు నివాళులర్పించారు.