
సాక్షి, గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు.. మూడు ముళ్లు కట్టి.. ఏడడుగులు వేసిన బంధాన్ని కాటికి పంపాడు.. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో భర్తకు జీవిత ఖైదు (బతికున్నంత కాలం) శిక్షను విధిస్తూ... ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా కాళిదాసు కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన మహంకాళి నాగమల్లేశ్వరరావు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మను (25) ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు భవన నిర్మాణ కార్మికుడిగా ఉండగా వెంకటేశ్వరమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుండేది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం అనంతరం కొద్ది కాలంగా వెంకటేశ్వరమ్మపై భర్త నాగమల్లేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు.
భార్యను చీటికి, మాటికి కొడుతూ ఉండటంతో వెంకటేశ్వరమ్మ తల్లి వెంకాయమ్మ పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యత చేసింది. దీంతో భార్యాభర్తలు మార్టూరు వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడకు వెళ్లినప్పటికీ నాగమల్లేశ్వరరావు ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో వెంకటేశ్వరమ్మ తన ఇద్దరు పిల్లలతో మంగళగిరిలోని గండాలయ్యపేటలో నివాసం ఉంటూ ఇంటి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది.
2013 ఆగస్టు 24న ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చిన నాగమల్లేశ్వరరావు భార్యతో ఘర్షణకు దిగడంతో చుట్టుపక్కలవారు, ఇంటి యజమాని మందలించి పంపించారు. మరుసటి రోజు 25వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో వెంకటేశ్వరమ్మ గదిలో నుంచి బయటకు వచ్చి తన కుమార్తెను బాత్‌రూముకు తీసుకెళుతున్న క్రమంలో తనతోపాటు కత్తి తెచ్చుకున్న నాగమల్లేశ్వరరావు వెంకటేశ్వరమ్మను విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న అన్న, తల్లి, ఇంటి యజమాని బయటకు వచ్చే సమయంలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు.
దీంతో వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యపై మృతురాలి సోదరుడు సాంబయ్య మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ ఆర్.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో, కోర్టు మాని టరింగ్ సెల్ ఏఎస్సై గాజుల శివప్రసాద్, టౌన్ పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ పాలపర్తి నరేంద్ర చొరవ చూపారు. కోర్టులో నాగమల్లేశ్వరరావుపై కేసు రుజువు కావడంతో న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ నిందితుడికి జీవించి ఉన్నంతకాలం జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.