సాక్షి, గుంటూరు: ప్రతి పనికీ ఓ రేటు కట్టి కే–ట్యాక్స్ పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. అధికారం అండతో ఆ కుటుంబం సాగించిన దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదురించే పరిస్థితి లేక అప్పట్లో వారంతా మిన్నకుండిపోయారు. వారిలో కొందరు ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తాము మోసపోయిన విషయాన్ని ధైర్యంగా చెప్పకోలేని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారు.
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేతిలో దోపిడీకి గురైన పలువురు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఇంకొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ 18 కేసులు
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటివరకూ 18 కేసులు నమోదయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్, రైల్వే, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి సొమ్ములు తీసుకున్నారని నిరుద్యోగులు, తమ పొలాలు, భూములను కబ్జా చేశారని రైతులు, భూ యజమానులు, తమ నుంచి కే–ట్యాక్స్‌లు వసూలు చేశారని బిల్డర్లు, మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు కోడెల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేశారు.
కోడెల కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ నరసరావుపేటకు చెందిన కేబుల్ ఆపరేటర్ ఎనుగంటి వెంకట కృష్ణారావు పోలీసులను ఆశ్రయించారంటే ఆ కుటుంబం అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి కోడెల కుటుంబం అరాచకాలపై విచారణ జరిపిస్తే మరికొందరు బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో నమోదైన ఓ కేసులో బాధితుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి రాజీ చేసుకోగా.. ఇంకా 17 కేసులు ఆ కుటుంబంపై ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment