Narasaraopet Police Sub-Division
-
‘కోడెల కాటు’ బాధితులెందరో!
సాక్షి, గుంటూరు: ప్రతి పనికీ ఓ రేటు కట్టి కే–ట్యాక్స్ పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. అధికారం అండతో ఆ కుటుంబం సాగించిన దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదురించే పరిస్థితి లేక అప్పట్లో వారంతా మిన్నకుండిపోయారు. వారిలో కొందరు ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తాము మోసపోయిన విషయాన్ని ధైర్యంగా చెప్పకోలేని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేతిలో దోపిడీకి గురైన పలువురు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఇంకొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 18 కేసులు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటివరకూ 18 కేసులు నమోదయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్, రైల్వే, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి సొమ్ములు తీసుకున్నారని నిరుద్యోగులు, తమ పొలాలు, భూములను కబ్జా చేశారని రైతులు, భూ యజమానులు, తమ నుంచి కే–ట్యాక్స్‌లు వసూలు చేశారని బిల్డర్లు, మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు కోడెల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ నరసరావుపేటకు చెందిన కేబుల్ ఆపరేటర్ ఎనుగంటి వెంకట కృష్ణారావు పోలీసులను ఆశ్రయించారంటే ఆ కుటుంబం అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి కోడెల కుటుంబం అరాచకాలపై విచారణ జరిపిస్తే మరికొందరు బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో నమోదైన ఓ కేసులో బాధితుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి రాజీ చేసుకోగా.. ఇంకా 17 కేసులు ఆ కుటుంబంపై ఉన్నాయి. -
అమ్మల వేదన.. అరణ్య రోదన
నరసరావుపేటటౌన్ : బిడ్డల జాడ తెలియక ఆ తల్లులు తల్లడిల్లిపోతున్నారు. నవమాసాలు మోసి కన్న చిన్నారులు అపహరణకు గురికావడం వారికి గుండెకోత మిగిల్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డల కోసం ఆ తల్లులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పిల్లల అదృశ్యంపై నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నమోదైన రెండు కేసుల విషయంలో నేటికీ ప్రగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారం రోజుల వయసు పసికందు అపహరణకు గురై 16 నెలలు గడిచింది. వారం కిందట ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ రెండు కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ చిన్నారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన గల్లా శారమ్మ, మరియబాబు దంపతులు వారం రోజుల పసికందుతో గతేడాది ఏప్రిల్ 15వ తేదీన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో జననీ సురక్ష యోజన కింద బాలింతలకు ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పొందేందుకు వచ్చారు. అక్కడ ఓ మహిళ చెప్పిన మాయమాటలకు మోసపోయారు. తమ బిడ్డను చూస్తూ ఉండమని అప్పగించడంతో ఆమె ఆ బిడ్డతో పరారైంది. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు అపహరణకు గురైన పాప కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. సంఘటన జరిగినప్పటి నుంచి అనేక మార్లు శారమ్మ దంపతులు పోలీస్‌స్టేషన్ వద్దకు రావడం, అయ్యా మా పాప ఆచూకీ లభించిందా.. అంటూ అధికారులను వేడుకోవడం, వారు చెప్పే సమాధానం విని తిరిగి నిరాశతో స్వగ్రామానికి చేరుకోవడం అలవాటైపోయింది. ఆడుకుంటున్న బాలుడి అపహరణ.. తాజాగా వారం రోజుల కిందట ఎన్జీవో కాలనీకి చెందిన గారపాటి జోసఫ్, మేరీల కుమారుడు ఎనిమిదేళ్ల జాన్ ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆ తర్వాత రోజు ఆగంతకులు ఫోన్ చేసి ‘మీ బిడ్డను కిడ్నాప్ చేశాం. రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం..’ అంటూ కుటుంబసభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. దీంతో జాన్ నాయనమ్మ సుశీల టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కిడ్నాప్ కేసుపై సమీక్ష నిర్వహించారు. కేసు ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గతంలో కిడ్నాప్ కేసుల్లో ఉన్న నిందితులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయినప్పటికీ చిన్న క్లూ కూడా దొరకకపోవడం విశేషం. జాన్ కుటుంబ సభ్యులు మాత్రం రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్దనే ఉంటూ తమ బిడ్డ కోసం పోలీసు అధికారులను అడుగుతూ కనిపిస్తున్నారు. మీ బిడ్డ ఆచూకీఏమైనా దొరికిందా అంటూ ఎవరైనా అడిగితే వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మిస్టరీగా మారిన రెండు కిడ్నాప్ కేసుల్లో ఎలాంటి పురోగతి లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.