అమ్మల వేదన.. అరణ్య రోదన
నరసరావుపేటటౌన్ : బిడ్డల జాడ తెలియక ఆ తల్లులు తల్లడిల్లిపోతున్నారు. నవమాసాలు మోసి కన్న చిన్నారులు అపహరణకు గురికావడం వారికి గుండెకోత మిగిల్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డల కోసం ఆ తల్లులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పిల్లల అదృశ్యంపై నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నమోదైన రెండు కేసుల విషయంలో నేటికీ ప్రగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారం రోజుల వయసు పసికందు అపహరణకు గురై 16 నెలలు గడిచింది. వారం కిందట ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ రెండు కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ చిన్నారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన గల్లా శారమ్మ, మరియబాబు దంపతులు వారం రోజుల పసికందుతో గతేడాది ఏప్రిల్ 15వ తేదీన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో జననీ సురక్ష యోజన కింద బాలింతలకు ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పొందేందుకు వచ్చారు. అక్కడ ఓ మహిళ చెప్పిన మాయమాటలకు మోసపోయారు. తమ బిడ్డను చూస్తూ ఉండమని అప్పగించడంతో ఆమె ఆ బిడ్డతో పరారైంది.
ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు అపహరణకు గురైన పాప కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. సంఘటన జరిగినప్పటి నుంచి అనేక మార్లు శారమ్మ దంపతులు పోలీస్‌స్టేషన్ వద్దకు రావడం, అయ్యా మా పాప ఆచూకీ లభించిందా.. అంటూ అధికారులను వేడుకోవడం, వారు చెప్పే సమాధానం విని తిరిగి నిరాశతో స్వగ్రామానికి చేరుకోవడం అలవాటైపోయింది.
ఆడుకుంటున్న బాలుడి అపహరణ.. తాజాగా వారం రోజుల కిందట ఎన్జీవో కాలనీకి చెందిన గారపాటి జోసఫ్, మేరీల కుమారుడు ఎనిమిదేళ్ల జాన్ ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆ తర్వాత రోజు ఆగంతకులు ఫోన్ చేసి ‘మీ బిడ్డను కిడ్నాప్ చేశాం. రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం..’ అంటూ కుటుంబసభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. దీంతో జాన్ నాయనమ్మ సుశీల టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కిడ్నాప్ కేసుపై సమీక్ష నిర్వహించారు. కేసు ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గతంలో కిడ్నాప్ కేసుల్లో ఉన్న నిందితులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.
అయినప్పటికీ చిన్న క్లూ కూడా దొరకకపోవడం విశేషం. జాన్ కుటుంబ సభ్యులు మాత్రం రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్దనే ఉంటూ తమ బిడ్డ కోసం పోలీసు అధికారులను అడుగుతూ కనిపిస్తున్నారు. మీ బిడ్డ ఆచూకీఏమైనా దొరికిందా అంటూ ఎవరైనా అడిగితే వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మిస్టరీగా మారిన రెండు కిడ్నాప్ కేసుల్లో ఎలాంటి పురోగతి లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.