ఏఎస్‌ఐ కోటేశ్వరరావుకు రివార్డు అందజేస్తున్న ఎస్పీ సీహెచ్ విజయారావు
గుంటూరు: పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వారు నివాసం ఉంటున్న బజారులోని నివాసాల్లో చోరీలు చేస్తుండటాన్ని పసిగట్టిన అర్బన్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా భర్తను అదుపులోకి తీసుకోగా భార్య విషయం తెలుసుకొని పరారైంది. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. పాత గుంటూరులోని బాలాజీ నగర్ 9వ లైనులో పాలెం రాజేష్, అతని భార్య వెంకటేశ్వరమ్మ నివాసం ఉంటున్నారు. తాపీ పనులకు వెళ్లే రాజేష్ వ్యసనాలకు బానిసై అదే బజారులో భార్యను కాపలాగా ఉంచి ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు. 2016లో ఓ ఇంట్లో చోరీ చేసి పోలీసులకు ఇప్పటివరకు పట్టుబడలేదు.
అదే నమ్మకంతో ఈనెల 20న మరో ఇంట్లో చోరీ చేశాడు. చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు రాజేష్‌ను అనుమానించి, అతన్ని ఓ కంట కనిపెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లాలాపేట పూలమార్కెట్ సెంటర్‌లో చోరీ చేసిన వస్తువులతో ఉండగా, గుర్తించి చాక చక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దఉన్న రూ.12 లక్షల విలువచేసే 400 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరమ్మ ఇంటికి తాళం వేసి పరారైంది. భార్యతో కలసి చోరీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్టు ఎస్పీ వివరించారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించి ఎస్పీ క్యాష్ రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీలు వైటీ నాయుడు, ఎస్.రాఘవ, డీఎస్పీ డి.ప్రసాదు, సీఐలు ఎస్.శ్రీనివాసరావు, సీహెచ్‌వీబీ సుబ్రమణ్యం, షేక్ అబ్దుల్ కరీం, ఎస్‌ఐ అమీర్, ఏఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment