కొత్తదారుల్లో కేటుగాళ్లు! | Cyber Criminals Operate New Tactics During Cyber Attacks | Sakshi
Sakshi News home page

కొత్తదారుల్లో కేటుగాళ్లు!

Published Sat, Aug 10 2019 9:08 AM | Last Updated on Sat, Aug 10 2019 9:08 AM

Cyber Criminals Operate New Tactics During Cyber Attacks - Sakshi

సాక్షి, తుళ్లూరు: వైష్ణవికి ఓ కొత్త నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘వైష్ణవి గారు మీ క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్‌ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్‌ చేయలేదని ఆమె అనడంతో చెక్‌ చేస్తానంటూ సదరు వ్యక్తి క్రెడిట్‌ కార్డు నంబర్, సీవీవీ, పిన్‌ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్‌ చేసిన అపరిచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్‌ మీ క్రెడిట్‌ కార్డు నుంచి జరగలేదు’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్‌ పెట్టేశాడు. సీన్‌ కట్‌ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్‌ కాలర్‌’ ఆన్‌లైన్‌ ద్వారా రూ.50 వేలు వైష్ణవి ఖాతా నుంచి మాయం చేశాడు. ఇది వైష్ణవి ఒక్కరి సమస్యేకాదు. సైబర్‌ నేరగాళ్లు వల విసురుతూ అందులో చిక్కుకున్న వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు.   

ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్‌ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేశాయి. ఫోన్లలో మనం వాడే 42 యాప్‌లు దేశ సమగ్రతకు ముప్పుగా  పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించాయి. సైబర్‌ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే ఆయా మొబైల్‌ యాజమానుల వ్యక్తిగత రహస్యాలను గుప్పిటపట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో 4.2 కోట్ల మొబైల్‌  యాప్‌లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్‌ నేరాలు ఇప్పుడి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి.  

మాటలతో మభ్యపెడుతూ..
ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్‌ పాలసీపై బోనస్‌ వచ్చిందని, వడ్డీలేని రుణాలు పేరుతో రకరకాలుగా ఫోన్‌కాల్స్‌ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తరువాత ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు. 

ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్‌ మారిస్తే మంచిది
పిన్‌ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్‌ నంబర్‌ మారిస్తే.. సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది  తమ పిన్‌ నంబర్‌ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పిన్‌ నంబర్‌ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోవడం ఉత్తమం.  

ఇలా చేస్తే సరి..

  • క్రెడిట్, డెబిట్‌ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి.
  • ప్రతి కార్డుకు వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ నంబర్‌ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి.  
  • క్రెడిట్‌ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి.
  • ఆన్‌లైన్‌ ద్వారా వ్యవహారాలు సాగించేటట్లయితే సైట్‌ అడ్రస్‌ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
  • కార్డులను పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్‌ చేయించాలి.
  • మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినప్పుడు ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి.
  • ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్‌ నంబర్‌ ఈ–మెయిల్‌ ఐడీలు గుడ్డిగా రాయకూడదు. 

స్మిషింగ్‌ వైరస్‌
స్మార్ట్‌ఫోన్ల ప్లాట్‌ ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్‌ వైరస్‌ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్‌ అని చెబుతూ.. అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్‌ అని, వద్దనుకుంటే నో అని టైప్‌ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా సైబర్‌ నేరగాళ్లు పంపే వైరస్‌ మీ సెల్‌ఫోన్‌లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్‌ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్‌ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్‌ మెయిల్‌ ఐడీ నుంచి జనరేట్‌ చేసి ఓ లింక్‌ని కూడా పంపుతారు. లింక్‌ ఓపెన్‌ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement