ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేలా పని చేయడంలో తప్పులేదు. కానీ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం ఫోన్‌కాల్, మెసేజ్‌లతో ఆమాయకులకు ‘ఆశ’ చూపిస్తూ అందిన కాడికి దోచేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.
ఓ యువతి పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మేడం మీరు ఆన్‌లైన్‌లో జాబ్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఈ సువర్ణావకం మీకోసమే. మేం చెప్పిన పని మీరు చేస్తే కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకు మీరు ఇంట్లోకూర్చొని యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే. అలా చేస్తే డబ్బు సంపాదించవచ్చు’ అనేది ఆ మెసేజ్ సారాంశం.
దీంతో ఆ యువతి తనకు వచ్చిన పార్ట్‌టైమ్ జాబ్ మెసేజ్‌కు సంతోష పడింది. సైబర్ కేటుగాళ్లు పంపిన రెండు యూట్యూబ్ ఛానల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. అందుకు గాను సైబర్ నేరస్తులు ఆమెకు రూ.120 పంపారు. ఆ సంతోషం రెట్టింపైంది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువ లేదు. స్కామర్‌లు తెలివిగా ఆమె సబ్‌స్క్రైబ్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల స్క్రీన్‌షాట్లను పంపమని అడిగారు. అనంతరం 'జాబ్ కోడ్' కూడా పంపారు. ఆ కోడ్‌ను టెలిగ్రామ్ అకౌంట్ పంపమని కోరారు. పైన పేర్కొన్న టెలిగ్రామ్ ఖాతాకు ఆమె జాబ్ కోడ్‌ను పంపిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ యువతి బ్యాంకు వివరాలను సేకరించారు.
వాళ్లు వివరాలు అడిగారని వెనకముందా అలోచించకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, జాబ్ కోడ్ పంపడంతో నిందితులు పని మొదలు పెట్టారు. ముందుగా ఆమె నమ్మేలా పార్ట్‌టైమ్ జాబ్ చేసినందుకు రెండు రోజుల వ్యవధిలో పలు మార్లు ఆమె అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. నమ్మకం కుదిరాక అమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.7,23,889 మొత్తాన్ని నాలుగు వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బుల్ని మాయం చేశారు. పాపం తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సురక్షితంగా ఉండడం ఎలా?
ఇటువంటి మోసాల నుండి సురక్షితంగా ఉండేలా లింక్డ్‌న్, నౌకరీ, ఇండీడ్ మొదలైన గుర్తింపు పొందిన పోర్టల్స్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత‍్నించే సమయంలో మీకు జాబ్ ఆఫర్ చేస్తే సదరు వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి పేరు, వారి కంపెనీ పేరు మొదలైన వివరాలను అడగాలి. ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి ఆన్‌లైన్‌లో సమాచారం సేకరించండి. అలాగే, పేరు, ఫోన్ నంబర్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపడం, లేదంటే బ్యాంక్ వివరాలను షేర్ చేయడం వంటివి చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment