cyber bank robbery
-
ఎస్ఎంఎస్ లింక్‌ను క్లిక్ చేసిన రైతు.. దానితో..!
కామారెడ్డి: సైబర్‌మోసానికి ఓ బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ఘటన మండలంలోని నూత్‌పల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పుండ్రు రాజేందర్ అనే రైతు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ లింక్‌ను క్లిక్ చేయడంతో తన బ్యాంకు నుంచి రూ.5,36,700 మాయం అయ్యాయి. రాజేందర్ యాసంగిలో సాగుచేసి అమ్మిన ధాన్యం డబ్బులు స్థానిక నూత్పల్లి యూనియన్ బ్యాంకులో జమ చేశాడు. సెప్టెంబర్ 30న ఆయన స్మార్ట్‌ఫోన్‌కు యూనియన్ బ్యాంకు లోగోతో ఎస్ఎంఎస్ వచ్చింది. బ్యాంకుకు సంబంధించిన మెసేజ్లాగా ఉందని క్లిక్ చేశాడు. మరుక్షణమే బ్యాంకు ఖాతా నుంచి ఒక రూపాయి, మళ్లీ రూ.28 డెబిట్ అయ్యాయి. అదే క్షణంలో ఖాతా నుంచి రూ.2లక్షలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. రాజేందర్ వెంటనే బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు పరీక్షిస్తుండగానే మరో రూ.2లక్షలు, మరోసారి రూ.1లక్ష, ఇంకోసారి రూ.36,700 డెబిట్ అయ్యాయి. మొత్తం నాలుగు సార్లు రూ.5,36,700 సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇది సైబర్ క్రైం మోసంగా అధికారులు గుర్తించి వెంటనే 1930కు ఫోన్ చేసి రైతుతో ఫిర్యాదు చేయించారు. వెస్ట్ బెంగాల్ ఇచ్చాపురానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంటి మరమ్మతుల కోసమని బ్యాంకులో డబ్బులు దాచుకున్నానని, సైబర్ మోసం జరగడంతో ఇంటి పనులు నిలిచిపోయాయని బాధిత రైతు రాజేందర్ వాపోయాడు. సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన నూత్‌పల్లిలో సైబర్ మోసం జరగడంతో పోలీసులు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతాదారులకు బుధవారం అవగాహన కల్పించారు. ఖాతా దారులు తమ మొబైల్ ఫోన్లకు అపరిచితులు పంపిన ఎస్ఎంస్లు, వాట్సప్ మెసేజ్‌లు ఓపెన్ చేయకూడదని ఎస్సై రాహుల్ తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
రూ.120 కోసం యువతి కక్కుర్తి.. రూ.7.23 లక్షలు మాయం!
ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేలా పని చేయడంలో తప్పులేదు. కానీ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం ఫోన్‌కాల్, మెసేజ్‌లతో ఆమాయకులకు ‘ఆశ’ చూపిస్తూ అందిన కాడికి దోచేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఓ యువతి పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మేడం మీరు ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఈ సువర్ణావకం మీకోసమే. మేం చెప్పిన పని మీరు చేస్తే కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకు మీరు ఇంట్లోకూర్చొని యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే. అలా చేస్తే డబ్బు సంపాదించవచ్చు’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో ఆ యువతి తనకు వచ్చిన పార్ట్‌టైమ్ జాబ్ మెసేజ్‌కు సంతోష పడింది. సైబర్ కేటుగాళ్లు పంపిన రెండు యూట్యూబ్ ఛానల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. అందుకు గాను సైబర్ నేరస్తులు ఆమెకు రూ.120 పంపారు. ఆ సంతోషం రెట్టింపైంది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువ లేదు. స్కామర్లు తెలివిగా ఆమె సబ్‌స్క్రైబ్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల స్క్రీన్షాట్లను పంపమని అడిగారు. అనంతరం 'జాబ్ కోడ్' కూడా పంపారు. ఆ కోడ్‌ను టెలిగ్రామ్ అకౌంట్ పంపమని కోరారు. పైన పేర్కొన్న టెలిగ్రామ్ ఖాతాకు ఆమె జాబ్ కోడ్‌ను పంపిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ యువతి బ్యాంకు వివరాలను సేకరించారు. వాళ్లు వివరాలు అడిగారని వెనకముందా అలోచించకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, జాబ్ కోడ్ పంపడంతో నిందితులు పని మొదలు పెట్టారు. ముందుగా ఆమె నమ్మేలా పార్ట్‌టైమ్ జాబ్ చేసినందుకు రెండు రోజుల వ్యవధిలో పలు మార్లు ఆమె అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. నమ్మకం కుదిరాక అమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.7,23,889 మొత్తాన్ని నాలుగు వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బుల్ని మాయం చేశారు. పాపం తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సురక్షితంగా ఉండడం ఎలా? ఇటువంటి మోసాల నుండి సురక్షితంగా ఉండేలా లింక్డ్న్, నౌకరీ, ఇండీడ్ మొదలైన గుర్తింపు పొందిన పోర్టల్స్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో మీకు జాబ్ ఆఫర్ చేస్తే సదరు వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి పేరు, వారి కంపెనీ పేరు మొదలైన వివరాలను అడగాలి. ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి ఆన్లైన్లో సమాచారం సేకరించండి. అలాగే, పేరు, ఫోన్ నంబర్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపడం, లేదంటే బ్యాంక్ వివరాలను షేర్ చేయడం వంటివి చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఆన్లైన్ బ్యాకింగ్‌లో ఈ సూచనలు కచ్చితం..! లేకపోతే అంతే సంగతులు..!
‘రెండు గంటల్లో రూ.10,000 రుణం మీ ఖాతాలో జమ.. కొన్ని ప్రాథమిక వివరాలు సమర్పిస్తే చాలు..’ ఒకరోజు బాలాజీ (30) మొబైల్‌కి వచ్చిన సందేశం ఇది. ఒక ఇన్స్టంట్ లోన్ యాప్ ఈ సందేశాన్ని పంపింది. దీంతో స్నాప్ఇట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇన్స్టాల్ సమయంలో ఎటువంటి యాక్సెస్‌కు అనుమతులు ఇవ్వలేదు. కానీ, ఒక గంట తర్వాత వచ్చిన మెస్సేజ్ చూసి బాలాజీ కలవరానికి గురయ్యాడు. బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష డెబిట్ అయినట్టు వచ్చిన సందేశం అది. వెంటనే తన బ్యాంకు ఖాతాలు అన్నింటినీ బాలాజీ బ్లాక్ చేసేశాడు. ‘సేవ్‌దెమ్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద దర్యాప్తు సంస్థను సంప్రదించాడు. బాలాజీ స్పాన్ఇట్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు కానీ, అందులోకి లాగిన్ అవ్వలేదు. కాంటాక్ట్‌లు, కెమెరా లేదా గ్యాలరీ ఎటువంటి యాక్సెస్‌కు అనుమతి కూడా ఇవ్వలేదు. కానీ, హ్యాకర్లు బాలాజీ ఫోన్లోకి యాప్ సాయంతో 59మాల్వేర్లు పంపించి తమ పని అంతా చక్కబెట్టేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. మాల్వేర్ల సాయంతో ఫోన్‌కు ఓటీపీలు పంపడమే కాకుండా, వాటితో లావాదేవీ నిర్వహించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల నిర్వహణ) నేడు డిజిటల్‌గా మారి.. స్టాక్ ట్రేడింగ్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, బ్యాంకు లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు అన్నింటికీ ఫోన్ ఆధారంగా మారినందున.. హ్యాక్‌కు గురైతే ఎంతటి నష్టమైనా ఎదురుకావచ్చు. ఈ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. సైబర్‌క్రైమ్ నేరాలు ఏటా భారీగా నమోదవుతున్నాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం సైబర్‌నేరాల పరంగా భారత్ స్థానం 10. డిజిటల్ యుగం కారణంగా సాధారణ జీవనం యాప్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్న తీరు సైబర్ నేరాలకు వరంగా మారుతోంది. సైబర్ దాడులకు ఎక్కువగా ప్రభావితమవుతున్నది అమెరికానేనని ఎస్పీఈకాప్స్ డేటా స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాకు కూడా సైబర్ దాడుల సమస్య తప్పడం లేదు. మన దేశంలోనూ గత కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా గతేడాది కరోనా వచ్చిన తర్వాత నుంచి సైబర్ నేరాలు మరింత పెరిగాయి. వ్యక్తిగత ఆర్థిక డేటాను కొట్టేసిన తర్వాత హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టేయడం ద్వారా బిట్కాయిన్లను పోగేసుకుంటున్నారు. వ్యక్తుల ప్రొఫైల్స్ వివరాలు, పేరు, సామాజిక భద్రతా సంఖ్య, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా నంబర్ ఇలాంటి వివరాలను 8–30 డాలర్ల మధ్య అమ్మేస్తున్నారు. డేటా విషయంలో అజాగ్రత్త పనికిరాదు.. ఈ డేటాను వారు ఎలా సంపాదిస్తున్నారు? అన్న సందేహం రావచ్చు. సిండికేట్ మోసం లేదా టెక్నాలజీ ఆధారిత మోసం రూపంలో ఈ సమాచారాన్ని వారు పొందుతున్నారు. కొన్ని రకాల దరఖాస్తులతోపాటు పాన్, ఆధార్ వివరాలు తీసుకోవడం సర్వసాధారణం. ఫైనాన్షియల్ కంపెనీ లేదా టెలికం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌కు వాట్సాప్ వేదికగా ఈ డాక్యుమెంట్లను కూడా షేర్ చేస్తుంటాం. కానీ, అందరూ కాకపోయినా కొందరు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో మనం పంచుకున్న వ్యక్తుల ఫోన్ హ్యాక్‌కు గురికావడం ద్వారా కూడా మన సున్నిత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇలా సంపాదించిన ఇతరుల డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. రుణాలిచ్చే సంస్థలకు ఎక్కువ ఆందోళన కలిగించే అంశం ఇదేనంటారు ఎర్లీశాలరీ సీఈవో అక్షయ్ మెహరోత్రా. టెక్నాలజీ సాయంతో చేసే మోసాల్లో.. సిస్టమ్ ద్వారా కస్టమర్ ప్రొఫైల్‌ను చోరీ చేసి.. మాల్వేర్ను చొప్పించేందుకు అదే పనిగా నేరస్థులు ప్రయత్నిస్తుంటారు. ‘‘స్థానిక హైపర్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో కస్టమర్లు తమ వివరాలను పొందుపరుస్తుంటారు. ఆ ప్లాట్‌ఫామ్‌లపై 10,000 మంది యూజర్లు కూడా ఉండరు. క్యాష్‌బ్యాక్ కోసం వివరాలను వెల్లడించి మోసాల బారిన పడుతున్నారు’’ అని మెహరోత్రా వివరించారు. పాస్‌వర్డ్‌ను కొందరు తరచుగా మార్చుకుంటూ ఉండరు. గుర్తుండదన్న ఆలోచనే వారితో అలా చేయిస్తుంది. దీనికితోడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం, టెక్నాలజీ మోసాలపై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరాలకు నష్టపోవాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చోరీ చేసిన డేటాను డార్క్‌నెట్ (డార్క్‌వెబ్)లో లేదంటే హ్యాకర్ ఫోరమ్‌లలో అమ్మేసుకోవడం నేరస్థులకు వ్యాపారంగా మారిపోయింది. క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్, పాస్వర్డ్లు, సామాజిక మాధ్యమాల్లో ఖాతాల లాగిన్ వివరాలను డార్క్ నెట్ ఫోరమ్‌లలో చాలా చౌకగా విక్రయించేస్తున్నారు. ఫోర్జరీ చేసిన పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆటో ఇన్సూరెన్స్‌లను కూడా అమ్మకానికి ఉంచుతున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు డార్క్‌వెబ్‌లో సగటున 35 డాలర్లు పలుకుతోంది. విలువైన డేటాను విక్రయించడం ద్వారా లావాదేవీలను బిట్కాయిన్లలో చేస్తున్నారు. బిట్కాయిన్ల లావాదేవీలన్నీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారితం. అధికారిక వ్యవస్థల ట్రాకింగ్‌కు దూరంగా ఉన్న సాధనం ఇదొక్కటే. 2020లో నమోదైన సైబర్ నేరాల్లో ఫిషింగ్ దాడులు కూడా ఒకటి. మీ డేటాకు రక్షణ ఇలా.. ఆన్లైన్లో ఎన్నో రకాల ఖాతాలను నిర్వహించడం నేటి జీవనంలో భాగం. కొందరు సులభంగా గుర్తుంటుందని అన్నింటికీ ఒక్కటే పాస్‌వర్డ్‌ను నిర్వహిస్తుంటారు. సైబర్ భద్రత పరంగా ఇదే అతిపెద్ద రిస్క్ అని తేలింది. కనుక ప్రతీ ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌ను నిర్వహించడం ఎంతో అవసరం. పాస్వర్డ్ మేనేజర్‌ను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ర్యాండమ్‌గా, బలమైన పాస్‌వర్డ్‌లను పాస్వర్డ్ మేనేజర్ ఇస్తుంటుంది. అలాగే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాస్వర్డ్ మేనేజర్ సాయంతో ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు క్రమం తప్పకుండా డిజిటల్ సెక్యూరిటీ ఎలా ఉందన్నదీ స్కాన్ కూడా చేస్తుంది. టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే.. పాస్‌వర్డ్‌తో లాగిన్ తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే పూర్తి స్థాయి లాగిన్‌కు వీలు కల్పించేది. దీన్ని వినియోగించుకోవడం సురక్షితం. ఎక్కువ యాక్సెస్‌కు అనుమతులు అడిగే యాప్‌ల విషయంలోనూ జాగ్రత్త. మొబైల్లో ఇన్స్టాల్ సమయంలో చాలా యాప్‌లు.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్‌లు, మెస్సేజ్‌ల యాక్సెస్‌ను (వాటిల్లోకి ప్రవేశించి సమాచారాన్ని పొందేఅనుమతి) అడుగుతుంటాయి. దీంతో వ్యక్తిగత డేటా మూడో పక్షానికి వెళ్లే ప్రమాదం కల్పించినట్టే. అందుకే ప్రతీ యాప్‌నకు సంబంధించి సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్‌ను పరిశీలించుకుంటూ ఉండాలి. అవసరమైన అనుమతులనే ఇవ్వాలి. మనం అనుమతులు ఇవ్వకపోయినా కొన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా ఆ పని చేస్తుంటాయి. కనుక అంతగా అవసరం లేని యాప్‌లకు దూరంగా ఉండడం మంచిది. సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం విషయంలో కచ్చితంగా వ్యవహరించాలి. నియంత్రణల పరిధుల్లో లేకుండా సామాజిక మాధ్యమ వేదికలు పనిచేస్తున్నాయి. కనుక వాటిపై విలువైన, సున్నితమైన సమాచారం పంచుకోకుండా ఉండడమే శ్రేయస్కరం. మీ ఆర్థిక వివరాలు (క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు) లీక్ అయినట్టు గుర్తించినా, సందేహం వచ్చినా వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. ఎక్కువ మంది క్రెడిట్‌కార్డు హోల్డర్లు తమకు నెలవారీగా వచ్చే స్టేట్మెంట్లోని లావాదేవీల వివరాలను తెరచి చూడరు. చెల్లించి ఊరుకుంటుంటారు. కానీ, ప్రతీ లావాదేవీని పరిశీలించుకోవాలి. మోసపూరిత లావాదేవీలను గుర్తిస్తే వెంటనే క్రెడిట్ కార్డు కంపెనీకి ఫిర్యాదు చేయాలి. ఏడాదికోసారి అయినా క్రెడిట్రిపోర్ట్లను పరిశీలించుకోవాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలు, కేవైసీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాల సాయంతో వేరొకరు రుణాలు తీసుకుని ఉంటే క్రెడిట్ రిపోర్ట్‌ల రూపంలో వెలుగులోకి వస్తాయి. మీ ప్రమేయం లేని రుణ ఖాతాలను గుర్తిస్తే వెంటనే అన్ని చానళ్ల వద్దా (క్రెడిట్ బ్యూరో, కార్డు కంపెనీ, పోలీస్ స్టేషన్, రుణదాత తదితర) ఫిర్యాదు దాఖలు చేయాలి. గాలం ఎలా? కేవైసీ వివరాలు కోరడం, మోసపూరిత క్యాష్ బ్యాక్‌లు ఆఫర్ చేయడం, డిజిటల్ వ్యాలెట్ మోసాలు, ఫిషింగ్, క్యూఆర్‌కోడ్స్, యూపీఐ ఫిషింగ్, లాటరీ మోసాలు, సోషల్ మీడియా స్కామ్‌లు ఇలా ఎన్నో రూపాల్లో నేరస్థులు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి సుమారు 5లక్షల క్రెడిట్‌కార్డుల వివరాలను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టిన ఘటనను ఇటీవల ఓ నివేదిక ప్రస్తావించింది. 2017లో సైబర్ దాడుల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు 18.5 బిలియన్ డాలర్ల (రూ.1.39లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని అంచనా. ‘‘ముంబై పోలీసులు అందించిన గణాంకాలను పరిశీలిస్తే.. సైబర్ నేరాల్లో కేవలం 10 శాతాన్ని వారు పరిష్కరించగలుగుతున్నారు. కనుక భారతీయులు ఆన్లైన్ లావాదేవీలు, ఆర్థిక అంశాల విషయంలో ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సైబర్ సెక్యూరిటీ క్లస్టర్–హెచ్ఎస్సీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బీవీ ప్రెసిడెంట్, సీఈవో అయిన జాకి ఖురేషి పేర్కొన్నారు. డార్క్ వెబ్ దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. అంటే ఇంటర్నెట్ ప్రపంచం. డార్క్‌నెట్‌లోని సైట్లలోకి వెళ్లాలంటే అందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం. టార్ (ది ఆనియన్ రూటర్) ఇటువంటిదే. ఇది గుర్తు తెలియని బ్రౌజర్. ఈ సాఫ్ట్వేర్ సాయంతో యూజర్లు డార్క్నెట్లోకి ప్రవేశించి ఎవరూ గుర్తించకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో అంచల ఎన్క్రిప్షన్ (గుప్తత) ఉంటుంది. దీంతో చట్టవిరుద్ధమై ఉత్పత్తులు, సేవల క్రయ విక్రయాలకు ఇది అడ్డాగా మారింది. టార్ నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేసుకునే పోర్టళ్లు డాట్‌కామ్, డాట్ నెట్, డాట్ ఓఆర్జీ బదులుగా.. డాట్ ఆనియన్ అని ఉంటాయి. అసలు డార్క్‌వెబ్ కాన్సెప్ట్ అన్నది చట్టవిరుద్ధమైన కార్యకలాపాల దృష్టితో వచ్చింది కాదు. ప్రజావేగులు, జర్నలిస్ట్‌లు, సామాజిక కార్యకర్తలు, దర్యాప్తు ఏజెన్సీలు ఇతరుల దృష్టిలో పడకుండా కీలక సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దీన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వాల నియంత్రణలు, నిఘా సంస్థల కళ్లలో పడకుండా ఈ వేదిక ఉపయోగపడుతుంది. కానీ, అక్రమార్కులకు సైతం ఇది వరంగా మారింది. డార్క్‌వెబ్‌లో సుమారు 5 లక్షల మంది యూజర్లున్నారు. ఏటా 3,20,000 లావాదేవీలు నమోదవుతున్నాయి. ఈ మార్కెట్ పరిమాణం ఎంతన్నది కచ్చితంగా తెలియదు. కానీ, ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం 2026 నాటికి సుమారు 840 మిలియన్డాలర్లుగా (రూ.6,300 కోట్లు) ఉంటుందని అంచనా. ఇవీ వాస్తవాలు.. 65,000 యూఆర్ఎల్లు డాట్ ఆనియన్ ఎక్స్‌టెన్షన్‌తో టార్ నెట్‌వర్క్‌పై అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్సైట్లు, సెర్చ్‌ఇంజన్లు సైతం ఆనియన్ వెర్షన్లను నిర్వహిస్తున్నాయి. 20 లక్షలకు పైగా యూజర్లు టార్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉన్నారు. ప్రతీ 39 సెకండ్లకు హ్యాకర్ల దాడి నమోదవుతోంది. గత మూడేళ్లలో డార్క్‌వెబ్‌పై కార్యకలాపాలు మూడింతలయ్యాయి. 59 శాతం ఇక్కడ విక్రయిస్తున్నది చట్టవిరుద్ధ డ్రగ్స్, కెమికల్సే. 2020లో 2200 రికార్డులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి వచ్చాయి. ఫార్చ్యూన్ 1000 కంపెనీలకు సంబంధించి 25.9 మిలియన్ ఖాతాలు, 543 మిలియన్ల ఉద్యోగుల వివరాలు డార్క్‌నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. 3,50,000 ఆర్థిక లావాదేవీల సున్నిత సమాచారం ఎప్పటికప్పుడు డార్క్‌వెబ్ చేరుతోంది. ఎక్కువగా ప్రభావితమవుతోంది బ్యాంకింగ్ రంగమే. సమాచారం లీక్ అయ్యే బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2.9 కోట్ల భారత ఉద్యోగార్థుల వివరాలు డార్క్వెబ్ను చేరాయి. 35 లక్షల మంది భారతీయ యూజర్ల వ్యక్తిగత వివరాలు (8.2 టెరాబైట్స్) డార్క్‌నెట్‌లో విక్రయానికి పెట్టారు. అలాగే, 70 లక్షల మంది భారతీయుల డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలు కూడా నేరస్థుల చేతుల్లోకి వెళ్లాయి. గతంలో ఎయిర్ ఇండియాకు సంబంధించి 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలు లీక్ అయ్యాయి. 2021లో స్టాక్‌బ్రోకింగ్ కంపెనీ అప్‌స్టాక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేవైసీ వివరాలు లీక్ అయ్యాయి. డామినోస్ యూజర్లకు సంబంధించి 10 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఎస్బీఐకి చెందిన 30 లక్షల ఖాతాదారుల వివరాలు కూడా గతంలో హ్యాక్‌కు గురయ్యాయి. -
కార్డు మీ జేబులో.. డబ్బు వారి ఖాతాల్లో..
మీకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉందా? అయితే అప్రమత్తంగా ఉండండి.. మీరు చూస్తూ ఉండగానే మీకు తెలియకుండా మీ వివరాలు కొట్టేసి మీ బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నాంటారు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కార్డు ద్వారా నేరస్తులు ఈ అక్రమ లావాదేవీలతో వారి పని వారు కానిచ్చేసుకుంటున్నారు. డెబిట్ కార్డు వినియోగంపై జాగ్రత్త లేకుంటే మీ నగదు గల్లంతేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, ఒంగోలు సిటీ: డెబిట్ కార్డు తన వద్దే ఉంది. అయినా తన ఖాతా నుంచి రెండు పర్యాయాలు డబ్బు డ్రా అయింది. మొత్తం రూ.40 వేలకు పైనే డబ్బు తీసుకున్నారు. తన ఖాతా నుంచి తనకు తెలియకుండా డబ్బు ఎవరు తీశారో అర్థం గాక లబోదిబోమన్నాడు ముడియాల వీరాంజనేయులు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామానికి చెందిన ఆయన పామూరుకు వచ్చి ఏటీఎం వినియోగించారు. అపరిచిత వ్యక్తి ద్వారా తన డెబిట్ కార్డు నుంచి నగదు ఏటీఎం నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత తన ఖాతా నుంచి దఫాలుగా డబ్బు తనకు తెలియకుండానే డ్రా అయింది. తన ఖాతాలో ఉండాల్సిన మొత్తాన్ని కన్నా తగ్గడంపై కంగుతిన్నాడు. ఇది ఎలా జరిగిందో పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు వస్తూనే ఉన్నా యి. సైబర్ నేరస్తుల మాయాజాలంలో ఇదో సాధారణ పద్ధతి మాత్రమే అంటున్నారు పోలీసులు. ఖాతాదారు జేబులోనే డెబిట్‌కార్డు ఉన్నా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్నారు. డెబిట్ కార్డును ఉపయోగించే ఆ డబ్బు డ్రా అవుతోంది. నకిలీ కార్డు ద్వారా నేరస్తుల ఆ అక్రమ లావాదేవీని కానిచ్చేస్తారు. అందుకోసం నేరస్తులు స్కిమ్మింగ్, క్లోనింగ్ ప్రక్రియలను అవలంభిస్తున్నారు. కార్డుదారుల వివరాలను కొట్టేయడంలో కొన్ని ముఠాలకు చెందిన ఏజెంట్లు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఏఏ ప్రాంతాల్లో.. ఎక్కువగా డెబిట్ కార్డులను దుస్తుల దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పెట్రోలు బంకులు లాంటి ప్రాంతాల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాలలో పని చేస్తున్న కొందరు వీలు చిక్కినప్పుడల్లా డెబిట్‌కార్డు వివరాలను చోరీ చేస్తున్నారు. తర్వా త ఆ వివరాలను అసలు నేరస్తులకు చేరవేస్తుం టారు. అనంతరం నకిలీ డెబిట్‌కార్డులను రూ పొందించి ఏటీఎం నుంచి నగదు కొట్టేస్తున్నారు. అంతా తెలుసుకునేలోపే.. నగదు డ్రా అయిందని అంతా తెలుసుకునే లోపే ఏటీఎం నుంచి నగదు చోరీకి గురవుతుంది. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లుగా సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వచ్చినప్పుడు మాత్రమే అసలు విషయం బహిర్గతమవుతుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకుల నుంచి నగదు తీసినా సంక్షిప్త సమాచారం రావడం లేదు. ఓటీపీలే కాలహరణం అయిన తర్వాత సెల్‌ఫోన్‌కు చేరుతున్నాయి. ఇక బ్యాంకు నుంచి నగదు అక్రమంగా డ్రా అయినా కొన్ని సందర్భాల్లో తెలిసే పరిస్థితి లేదు. విషయం తెలిస్తేనే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. డెబిట్ కార్డులపై ప్రతి ఒక్కరూ సంపూర్ణ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు. కార్డులో వివరాలు ఇలా కొట్టేస్తున్నారు సాధారణంగా డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ లావాదేవీలే అధికం కానున్నాయి. రెస్టారెంట్లు, బార్లు, పెట్రోలు బంకులు, బట్టల దుకాణాలు ఇలా పలు చోట్ల బిల్లు కట్టాల్సి వస్తే డెబిట్, క్రిడిట్ కార్డులనే వినియోగించడం పరిపాటిగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని ముఠాలు కార్డులోని వివరాలను కొట్టేయడానికి వివిధ మార్గాలను అనుసరిస్తున్నాయి. సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. కొందరు వెయిటర్లు, స్టివార్డులు తదితరులను ముఠాలు తమ ఏజెంట్లుగా ఎంపిక చేసుకుంటున్నారు. వారికి ఎరవేసి తమ దారికి వచ్చిన వారికి కార్డు రీడర్ (స్కిమ్మర్) యంత్రాన్ని అప్పగిస్తారు. సాధారణంగా వినియోగదారుని కార్డును స్వైపింగ్ యంత్రం (పీవోఎస్)లో పెడితే అందులోని వివరాలను యంత్రం రీడ్ చేస్తుంది. దాని ఆధారంగానే కార్డుదారుని బ్యాంకు ఖాతా నుంచి అవసరమైన నగదు సంబందిత సంస్థ నిర్వాహకుని బ్యాంకు ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇక్కడే సైబర్ నేరస్తుల ముఠాకు చెందిన ఏజెంట్లు డేటాను తస్కరిస్తారు. ఈ ప్రక్రియనే స్కిమ్మింగ్ అంటారు. వివిధ స్వైపింగ్ కేంద్రాల్లో పీవోఎస్ యంత్రాలకే రహస్యంగా కార్డు రీడర్‌ను అమర్చుతారు. ఇదంతా అసలు నిర్వాహకులకు తెలియకుండా ఏజెం ట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ యంత్రంలో వినియోగదారుడి కార్డు రీడ్ చేస్తే యాంత్రికంగానే ఏజెంటు రహస్యంగా అమర్చిన రీడర్లో కార్డు వివరాలన్నీ నిక్షిప్తమవుతాయి. అలా కొన్ని కార్డుల వివరాల్ని దొంగచాటుగా సేకరించిన తర్వాత ఏజెంట్ దగ్గర నుంచి కార్డ్ రీడర్‌ను అసలు నేరస్తులు తీసుకుంటారు. ఇందు కోసం ఉపయోగపడిన ఏజెంట్లుకు కమిషన్ ముట్టజెబుతారు. ► ఏజెంట్లు తెలివిగా వినియోగదారుల నుంచి కార్డు తీసుకుని లోపల స్వైప్ చేసుకొస్తామని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ సరిగ్గా లేదంటారు. సిగ్నల్స్ రావడం లేదు..బయటకు వెళ్తామంటారు. అక్కడే వినియోగదారులు ఏమరపాటుకు గురవుతారు. అజాగ్రత్తగా కార్డును తీసి అప్పగిస్తారు. అలాగే పిన్ నంబర్ చెప్పేస్తారు. అదే అదనుగా లోపలికి వెళ్లి సాధారణంగా పీవోఎస్ యంత్రంలో ఆ కార్డును రీడ్ చేస్తారు. సాధారణంగా బిల్లు అయిన మొత్తమే ఉపసంహరణకు గురైనట్లుగా వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది. ఆ మొత్తం సరిగ్గానే ఉండడంతో వినియోగదారునికి ఏ మాత్రం అనుమానం రాదు. కానీ ఆ తర్వాత సదరు ఏజెంటు స్కిమ్మర్‌లోనూ కార్డు రీడ్ చేస్తారు. కానీ ఈ సారి ఎలాంటి డబ్బు ఉపసంహరించడు. కాకపోతే కార్డు సమగ్ర వివరాలన్నీ మాత్రం స్కిమ్మర్‌లో నిక్షిప్తమవుతాయి. అప్పటికే పిన్ నంబర్ ఏజెంట్‌కు తెలుస్తుంది కాబట్టి అక్కడితో నేరస్తుల తొలి అంకం విజయవంతమవుతుంది. ► అలా కార్డు వివరాలను అసలు నేరస్తులకు అందిన తర్వాత రెండో అంకానికి తెర తీస్తారు. కార్డు సమగ్ర వివరాలు ఉంటాయి కాబట్టి కార్డు వివరాలను బట్టి క్లోనింగ్ ప్రక్రియ చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా అసలు కార్డులో వివరాలను నమోదు చేస్తారు. అలా నకిలీ కార్డు తయారవుతుంది. ఎలాగూ కార్డు పిన్ నంబర్ తెలిసి ఉంటుంది కాబట్టి ఏటీఎంలోకి వెళ్లి పిన్ నంబర్‌ను మార్చేసి వీలైనంత వేగంగా ఖాతాలోని నగదు ఏటీఎం నుంచి ఉపసంహరిస్తారు. ఇలా జాగ్రత్త పడితే మేలు ► ఎట్టి పరిస్థితిల్లో క్రిడిట్, డెబిట్ కార్డులు వాడేటప్పుడు వెయిటర్లు, స్టివార్డుల చేతికి వివరాలు అప్పగించవద్దు. ► బిల్లు కట్టే సమయంలో కార్డులు లోపలికి తీసుకు వెళ్లి స్వైప్ చేస్తామంటే అంగీకరించ వద్దు. ► రహస్యంగా ఉంచాల్సిన పిన్ నంబర్‌ను వారికి చెప్ప వద్దు. తాము కూర్చున్నచోటికే స్వైపింగ్ యంత్రాన్ని తీసుకు వచ్చి లావాదేవీ నిర్వహించమని చెప్పాలి. ► తమ ఎదురుగానే స్వైప్ చేయాలని అడగాలి. ఆ సమయంలో కార్డు నంబర్, గడువు ముగింపు తేదీ, సీవీవీ నంబర్‌ను తస్కరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► తరుచూ పిన్ నంబర్లను మారిస్తే మరింత అప్రమత్తంగా ఉండవచ్చు. -
కొత్తదారుల్లో కేటుగాళ్లు!
సాక్షి, తుళ్లూరు: వైష్ణవికి ఓ కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘వైష్ణవి గారు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో చెక్ చేస్తానంటూ సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్ చేసిన అపరిచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదు’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్లైన్ ద్వారా రూ.50 వేలు వైష్ణవి ఖాతా నుంచి మాయం చేశాడు. ఇది వైష్ణవి ఒక్కరి సమస్యేకాదు. సైబర్ నేరగాళ్లు వల విసురుతూ అందులో చిక్కుకున్న వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేశాయి. ఫోన్లలో మనం వాడే 42 యాప్‌లు దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించాయి. సైబర్ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోగానే ఆయా మొబైల్ యాజమానుల వ్యక్తిగత రహస్యాలను గుప్పిటపట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో 4.2 కోట్ల మొబైల్ యాప్‌లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. మాటలతో మభ్యపెడుతూ.. ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాలు పేరుతో రకరకాలుగా ఫోన్‌కాల్స్ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తరువాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు. ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్ మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పిన్ నంబర్ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే సరి.. క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. ప్రతి కార్డుకు వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ నంబర్ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి. క్రెడిట్ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి. ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించేటట్లయితే సైట్ అడ్రస్ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. కార్డులను పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించాలి. మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినప్పుడు ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి. ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నంబర్ ఈ–మెయిల్ ఐడీలు గుడ్డిగా రాయకూడదు. స్మిషింగ్ వైరస్ స్మార్ట్ఫోన్ల ప్లాట్ ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్ వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని చెబుతూ.. అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్ అని, వద్దనుకుంటే నో అని టైప్ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ సెల్ఫోన్లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్ మెయిల్ ఐడీ నుంచి జనరేట్ చేసి ఓ లింక్‌ని కూడా పంపుతారు. లింక్ ఓపెన్ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం. -
లండన్ లో స్పానిష్ బ్యాంక్ దోపిడి కేసులో భారతీయుడి అరెస్ట్!
లండన్ లో స్పానిష్ బ్యాంక్ సాంటెండర్ ను దోచుకోవడానికి ప్రయత్నించిన ఓ భారతీయుడితో పాటు నలుగురిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. కంప్యూటర్లను హ్యాక్ చేసి స్పానిష్ బ్యాంక్ లో లక్షలాది పౌండ్లను దోచుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన ఆకాశ్ వాఘేలా, అసద్ ఆలీ ఖురేషి, లాన్నే ముల్లిన్స్ అబుదు, డీన్ ఓత్రాంలను శనివారం వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరిపై కుట్ర కేసు నమోదు చేసి డిస్టిక్ట్ జడ్జ్ హోవార్డ్ రిడిల్ రిమాండ్ కు పంపారు. మళ్లీ సౌతావార్క్ క్రౌన్ కోర్టు లో సెప్టెంబర్ 27 తేదిన మళ్లీ ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే వాఘేలాను సెప్టెంబర్ 27 తేది వరకు బెయిల్ పై విడుదల చేశారు. ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసి విచారించి.. ఆ తర్వాత నలుగురిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు మిగిలిన ఎనిమిది మందిని బెయిల్ పై విడుదల చేశారు.కీబోర్డు వీడియో మౌస్ ద్వారా బ్రాంచ్ లోని కంప్యూటర్లను రిమోట్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సైబర్ గ్యాంగ్ ప్రయత్నించినట్టు విచారణలో తేలింది.