Telangana News: ఎస్‌ఎంఎస్‌ లింక్‌ను క్లిక్‌ చేసిన రైతు.. దానితో..!
Sakshi News home page

ఎస్‌ఎంఎస్‌ లింక్‌ను క్లిక్‌ చేసిన రైతు.. దానితో..!

Published Thu, Oct 5 2023 1:34 AM

- - Sakshi

కామారెడ్డి: సైబర్‌మోసానికి ఓ బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ఘటన మండలంలోని నూత్‌పల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పుండ్రు రాజేందర్‌ అనే రైతు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ లింక్‌ను క్లిక్‌ చేయడంతో తన బ్యాంకు నుంచి రూ.5,36,700 మాయం అయ్యాయి. రాజేందర్‌ యాసంగిలో సాగుచేసి అమ్మిన ధాన్యం డబ్బులు స్థానిక నూత్‌పల్లి యూనియన్‌ బ్యాంకులో జమ చేశాడు.

సెప్టెంబర్‌ 30న ఆయన స్మార్ట్‌ఫోన్‌కు యూనియన్‌ బ్యాంకు లోగోతో ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. బ్యాంకుకు సంబంధించిన మెసేజ్‌లాగా ఉందని క్లిక్‌ చేశాడు. మరుక్షణమే బ్యాంకు ఖాతా నుంచి ఒక రూపాయి, మళ్లీ రూ.28 డెబిట్‌ అయ్యాయి. అదే క్షణంలో ఖాతా నుంచి రూ.2లక్షలు డెబిట్‌ అయినట్లు ఫోన్‌కు మెసెజ్‌ వచ్చింది. రాజేందర్‌ వెంటనే బ్యాంకుకు వెళ్లాడు.

బ్యాంకు అధికారులు పరీక్షిస్తుండగానే మరో రూ.2లక్షలు, మరోసారి రూ.1లక్ష, ఇంకోసారి రూ.36,700 డెబిట్‌ అయ్యాయి. మొత్తం నాలుగు సార్లు రూ.5,36,700 సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఇది సైబర్‌ క్రైం మోసంగా అధికారులు గుర్తించి వెంటనే 1930కు ఫోన్‌ చేసి రైతుతో ఫిర్యాదు చేయించారు. వెస్ట్‌ బెంగాల్‌ ఇచ్చాపురానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తన ఇంటి మరమ్మతుల కోసమని బ్యాంకులో డబ్బులు దాచుకున్నానని, సైబర్‌ మోసం జరగడంతో ఇంటి పనులు నిలిచిపోయాయని బాధిత రైతు రాజేందర్‌ వాపోయాడు.

సైబర్‌ మోసాలపై పోలీసుల అవగాహన
నూత్‌పల్లిలో సైబర్‌ మోసం జరగడంతో పోలీసులు స్థానిక యూనియన్‌ బ్యాంకులో ఖాతాదారులకు బుధవారం అవగాహన కల్పించారు. ఖాతా దారులు తమ మొబైల్‌ ఫోన్లకు అపరిచితులు పంపిన ఎస్‌ఎంస్‌లు, వాట్సప్‌ మెసేజ్‌లు ఓపెన్‌ చేయకూడదని ఎస్సై రాహుల్‌ తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
Advertisement