మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ కాలేషావలి, ఎస్‌ఐ మీర్జా నజీర్ బేగ్
గుంటూరు , సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆశ వర్కర్ దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... సత్తెనపల్లి మండలం పెదమక్కెన గ్రామానికి చెందిన గడిపర్తి వెంకటరమణ (40), కోటేశ్వరరావులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడు డిగ్రీ, చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నారు. వెంకటరమణ ఆశ వర్కర్‌గా పని చేస్తుండగా కోటేశ్వరరావు కూలి పనులకు వెళ్లేవాడు. మూడేళ్ల క్రితం కోటేశ్వరరావుకు పక్షవాతం రావడంతో కుటుంబ బాధ్యతలన్నీ వెంకటరమణ తన భుజాన వేసుకుంది. ఈ క్రమంలో పొలం పనులు కూడా ఆమే చూస్తోంది.
జమా ఖర్చులు లెక్కలు చెప్పడం లేదని భర్త కోటేశ్వరరావు కొంత కోపంగా ఉన్నాడు. రెండు రోజులగా వీరి భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. గురువారం ఇంట్లో ఉన్న వెంకటరమణ నిర్జీవంగా పడి ఉంది. ఆమె తల నుంచి రక్తస్రావం కావడం, దగ్గర్లో బాడిశకు రక్తం ఉండడంతో వెంకటరమణను భర్త కోటేశ్వరరావు హతమార్చి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలి, రూరల్ సీఐ ఎం వీరయ్య, రూరల్ ఎస్‌ఐ మీర్జానజీర్ బేగ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కత్తి విజయమ్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment