
శ్రీహరి (ఫైల్)
గుంటూరు ఈస్ట్: స్నేహితుడి బంధువులు అక్రమంగా నిర్బంధించి, కొట్టడంతో అస్వస్థతకు గురైన యువకుడు మృతిచెందిన ఉదంతం ఇది. పాతగుంటూరు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు బాలాజీ నగర్ 8వ లైనులో నివసించే ఇక్కుర్తి శ్రీహరి (26) మణి హోటల్ సెంటర్‌లో శ్రీ మహాలక్ష్మి పెయింటింగ్స్ షాపు నిర్వహిస్తున్నారు. బర్జర్ పెయింట్ డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. పొత్తూరి వారి తోటలో అదే ప్రాంతానికి చెందిన షేక్ హబీబ్ న్యూ ఎస్‌ఈ పెయింట్స్ షాపు నిర్వహిస్తూ ఏషియన్ పెయింట్స్ డీలర్‌గా ఉన్నారు. వీరిద్దరూ ఏడాది కాలంగా స్నేహంగా ఉంటూ రెండు కంపెనీల పెయింట్‌లను తమ అవసరాల మేరకు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. హబీబ్ గత నెల 25వ తేదీన 3 నెలలపాటు ఉండే విధంగా ఇండోనేషియా వెళ్తూ శ్రీహరికి ఏషియన్ పెయింట్స్ సరుకు అప్పచెప్పారు. సరుకు విక్రయించడం వలన వచ్చే కమీషన్‌ను అతనే డ్రా చేసేందుకు అనుగుణంగా రూ.70 వేలు చెక్కు రూపంలో ఇచ్చారు.
హబీబ్ ఇండోనేషియా వెళ్లిన అనంతరం ఈ విషయం తెలుసుకున్న అతని తమ్ముడు జాబీబ్, బావ ఫిరోజ్ శ్రీహరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకు పథకం వేశారు. పథకం ప్రకారం ఈ నెల ఒకటో తేదీ గుంటూరు వారి తోటలోని ఓ ఇంట్లోకి శ్రీహరిని రప్పించారు. జాబీబ్, ఫిరోజ్‌లతో పాటు వారి స్నేహితులైన ఆర్‌ఎస్‌ఐగా పనిచేసే మహ్మద్ మస్తాన్, ఓ పత్రికా విలేకరి (సాక్షి కాదు) అని చెప్పుకున్న షేక్ రహంతుల్లా కలిసి శ్రీహరిని బంధించి తీవ్రంగా కొట్టారు. శ్రీహరి సెల్‌లో నుంచి అతని అన్న సుధీర్‌కు ఫోన్ చేసి హబీబ్ ఇచ్చిన ఏషియన్ పెయింట్స్ స్టాకు మొత్తం వెనక్కి తెప్పించారు. సుధీర్ స్టాకు తెచ్చేలోపు శ్రీహరిని బెదిరించి 8 చెక్కులు, రెండు ప్రామిసరీ నోట్లు తీసుకున్నారు. అనంతరం అర్థరాత్రి సమయంలో శ్రీహరిని వదిలిపెట్టారు. వారికి భయపడిన అన్నదమ్ములిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బంధువులతో జరిగిన విషయం చెప్పి, ధైర్యం తెచ్చుకుని 3వ తేదీ రాత్రి పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావుకు జరిగిందంతా చెప్పి ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్దిసేపటికే శ్రీహరి పోలీస్‌స్టేషన్‌లోనే తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పాడు. అతని వెంట ఉన్న బంధువులు శ్రీహరిని జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీహరికి ఇంకా వివాహం కాలేదు. తండ్రి గతంలోనే మృతి చెందాడు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లి వెంకటేశ్వరమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.