రెంటచింతల మండలం పాలవాయి జంక్షన్‌లో నిరసనలు
ముక్కుపచ్చలారని పసికందులను ముచ్చటగా లాలించాల్సిన వారు.. రాబందుల్లా మారి పొడుచుకుతింటున్నారు. చాకెట్ల ఆశ చూపి మభ్యపెడుతున్న రాక్షసులు.. చిన్నారులపై రక్కసి మూకల్లా ఎగబడుతున్నారు. కమ్మని కథలు చెప్పి ఆడించాల్సిన తాతయ్యలు.. కామాంధులుగా మారి కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో మదమెక్కిన ఆకతాయిలు.. కళ్లెం తెగిన ఆంబోతుల్లా విచక్షణ మరిచి చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. ఆటపాటలతో నవ్వించాల్సిన వారే.. తమ శరీరాలతో వికృత ఆటలాడుతుంటే.. ఏం జరుగుతుందో తెలియక, అంతులేని బాధను తట్టుకోలేక లైంగిక దాడి బాధితులు విలవిలలాడుతున్నారు. కామాంధుల పశు వాంఛకు బలవుతున్న ఎందరో బాలికలు.. అమ్మో.. మృగాళ్లంటూ బిక్కుబిక్కుమంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రెంటచింతల మండలం తుమృకోటలో మంగళవారం రాత్రి ఏడేళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై నిరసనలు మిన్నంటాయి.
సాక్షి, గుంటూరు:మానవ మృగాలు రెచ్చిపోయి అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడుతున్నారు. మద్యం మత్తులో ఒకరు.. పర్‌వర్షన్‌కు గురై మరికొందరు కామాంధులుగా మారి చిన్నారుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులకు మాయమాటలు చెప్పి ఏమారుస్తూ కుత్సితమైన కామవాంఛలు తీర్చుకుంటున్నారు. తాత, బాబాయ్, సోదరుడు, మామయ్య, బావ వరుసలు అయ్యే వారితో పాటు, ఇళ్ల పక్కన నివాసం ఉంటూ నమ్మకంగా చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మృగాళ్లు చిన్నారుల తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. నొప్పిగా ఉంది నన్ను వదిలేయ్ తాతా... ప్లీజ్ మామయ్య... భరించలేకపోతున్నానంటూ ఆ చిన్నారులు రోదించినా... పాషాణం లాంటి ఆ మానవ మృగాల మనస్సులు ఏమాత్రం చలించడం లేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ చిన్నారులను ఆడుకునేందుకు బయటకు పంపేందుకు కూడా హడలిపోతున్నారు. మైనర్ బాలికలు, మహిళల రక్షణ కోసం పోలీసులు సబల, జ్వాల వంటి కార్యక్రమాలు పెట్టినా మైనర్ బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిన్నారులపై జరుగుతున్న వరుస ఘటనలు ఎలా అడ్డుకోవాలో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
10 నెలల్లో 20కు పైగా ఘటనలు
జిల్లాలో పది నెలల వ్యవధిలో 20 మందికిపైగా చిన్నారులపై మృగాళ్లు లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు తప్ప, బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దాచేపల్లి ఘటనలో ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో శాంతి భద్రతల సమస్యతోపాటు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిందితుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడానికి కూడా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలే కారణంగా చెప్పవచ్చు.
జిల్లాలో జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే..
జిల్లాలోని మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 35 ఏళ్ల వయస్సు ఉన్న కేతావత్ బాలునాయక్ అనే మృగాడు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన 2018 మార్చి 22వ తేదీన జరిగింది. మానవ మృగం దాడికి తట్టుకోలేక తీవ్ర రక్తస్రావంతో ఆచిన్నారి లోకాన్నే వదిలేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. బెల్లంకొండ పోలీసుస్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న మూగ, చెవుడు బాలికపై 30 ఏళ్ల వయస్సు ఉన్న షేక్ ఘన్‌సైదా అనే కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 20న జరిగింది. కొల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఏడేళ్ల వయస్సు చిన్నారిపై 25 ఏళ్ల వయస్సు ఉన్న జొన్నకూటి గోపి అనే మృగాడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నరసరావుపేట పట్టణంలోని బీసీ కాలనీలో ఏడేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై ఇంటి పక్కనే నివశించే షేక్ మౌలాలి అనే 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన జరిగింది.
పిట్టలవానిపాలెం మండలం చందోలు పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై 20 ఏళ్ల వయస్సు ఉన్న చెట్టుపల్లి ప్రవీణ్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన చోటు చేసుకుంది. దాచేపల్లి పట్టణంలో తొమ్మిదేళ్ళ బాలికపై అన్నం సుబ్బయ్య అనే 55 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన 2018 మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు, దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా స్పందించి రోడ్లపై భారీ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. నిందితుడు సైతం భయంతో ఉరివేసుకుని మృతిచెందాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారికి భూమి మీద అదే చివరి రోజు అవుతుందంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఆయన హెచ్చరించిన రెండు రోజులకే చుండూరు మండలం మోదుకూరులో ఏడేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై 25 ఏళ్ల వయస్సు ఉన్న మృగాడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో జిల్లాలో తీవ్ర అలజడి రేగింది. ఆ తరువాత పాతగుంటూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన యువకుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడిన సంఘటన అందరికీ తెలిసిందే.
చిన్నారిపై కిరాతకంగా...
ఈ దుర్ఘటనలు మరువకముందే రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో ఏడేళ్ల మైనర్ బాలిక మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లడాన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన మిర్యాల జయరాం(27) పుల్‌గా మద్యం తాగి బాలిక నోరు మూసి సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్న బాలికను అత్యంత కిరాతకంగా రాయితో దవడపై కొట్టగా రెండు పళ్లు ఊడిపడ్డాయి. తమ కుమార్తె ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి బాలిక తల్లి బాలిక కోసం వెతుకుతుండగా రాత్రి 9.45 గంటల సమయంలో బాలిక తీవ్ర రక్త స్రావంతో ఏడ్చుకుంటూ ఒళ్లంతా గాయాలతో ఇంటికి వచ్చి జరిగిన సంఘటనను వివరించింది.
ఆడపిల్లను కనడమే పాపమా..?
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆటోలో పిల్లలను బడికి పంపాలన్నా, ఇంటి బయట ఆడుకునేందుకు పంపాలన్నా, బంధువుల ఇళ్లల్లో వదిలి వెళ్లాలన్నా.. భయపడాల్సిన దుస్థితి దాపురించింది. చిన్న, పెద్ద, బంధువులు, స్నేహితులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మగాడిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆడపిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆడపిల్ల అర్థరాత్రి ఒంటరిగా తిరగడం మాట అటుంచి, పట్టపగలు ఇంటి బయటకు వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితులు తలెత్తడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment