సాక్షి, సిటీబ్యూరో: ఆరేళ్ల చిన్నారిని కబలించిన మృగాళ్ల పైశాచికత్వం బాల్యంపై వాలిన రాబందుల రెక్కల దుర్మార్గానికి పరాకాష్ట. ఎప్పుడు ఏ వీధిలో, ఏ రోడ్డుపైన ఎక్కడ ఏ చిన్నారి బలవుతుందో తెలియని దుస్థితి. పిల్లల సంరక్షణ తల్లిదండ్రులు, సమాజానికి సవాల్‌గా మారింది. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఉదంతం యావత్ సమాజాన్ని కదిలించింది. మెరుపు మెరిసినా, వాన కురిసినా, ఆకాశంలో హరివిల్లులు విరిసినా తమకోసమేనని మురిసే పాలబుగ్గల చిట్టితల్లులు రాబందుల రాక్షసత్వానికి బలవుతున్నారు. నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న అమానవీయ ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం చేసిన చట్టాలన్నీ చట్టబండలుగానే మిగులుతున్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి. ఎంతో సంతోషంగా హోలీ ఆడుకుంటున్న చిన్నారిని తమ పశుత్వానికి బలితీసుకున్న ఉదంతం వంటి అనేక సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు బాల్యవివాహాలు, మరోవైపు అత్యాచారాలు, ఇంకోవైపు గుదిబండలా మారిన బాలకార్మిక వ్యవస్థ రేపటి తరం పట్ల శాపంగా పరిణమించాయి.
తెలిసిన వాళ్లే కాలయములు...
పిల్లలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారిలో ఎక్కువ శాతం ఆ కుటుంబాలకు తెలిసిన వారు, బాగా పరిచయం ఉన్నవాళ్లు, లేదా అదే బస్తీలో నివసిస్తున్న వారే కావడం గమనార్హం.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 42 లైంగికదాడి ఘటనలు నమోదయ్యాయి. ఇవి పోలీసుల దృష్టికి వచ్చినవి మాత్రమే. అయితే వయోబేధం మరిచి లైంగికపరమైన చర్యలకు పాల్పడే సంఘటనలు వందల్లోనే ఉంటాయని సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు పేర్కొంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఇళ్లల్లో ఒంటరిగా ఉండే చిన్నారులను లక్ష్యంగా చేసుకొని తాగుబోతులు, తెలిసిన వాళ్లు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఆ కుటుంబాలకు బాగా పరిచయం ఉన్న వారు కావడం, ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వారి ఇంటికి వచ్చి పోతుండటం వల్ల చిన్నారులు పెద్దగా సందేహించకుండానే అమాయకంగా ఈ పశువుల బారిన పడుతున్నారు.
తరచూ తమ తల్లిదండ్రులతో మాట్లాడుతుండడంతో వారిని తమకు ఎంతో దగ్గరి వారుగా భావిస్తున్నారు. ఆ దుర్మార్గులు సైతం పిల్లలకు చాక్లెట్లు, తినుబండారాలు ఆశ చూపించి వంచిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో 5 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఒకరు ఐదేళ్ల చిన్నారి. అలాగే సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల పాపతో పాటు మరో చిన్నారిపైనా దాడి జరిగింది. జీడిమెట్ల, చందానగర్, జగద్గిరిగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, బాలానగర్, మియాపూర్, తదితర ప్రాంతాల్లో ఎంతోమంది చిన్నారులు దుర్మార్గుల పశువాంఛకు సమిధలయ్యారు. ‘‘ ఎక్కడా ఎలాంటి అనుమానం రాదు. బాగా తెలిసినవాళ్లే అయి ఉంటారు. కానీ అదను చూసి కాటేస్తారు. ఎలాంటి పరిచయస్తులైనా సరే పిల్లలను వారి దగ్గరకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి.’’ అని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ లావణ్య సూచించారు. చిన్నారులు తమను తాము రక్షించుకొనేలా తల్లిదండ్రులు వారికి కొన్ని మెళకువలు నేర్పించాలన్నారు. తల్లి కాకుండా ఇతరులు ఎవరైనా పిల్లల శరీర భాగాలను ముట్టుకోవడానికి వీల్లేదని, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి నుంచి విడిపించుకొనేలా పిల్లలకు శిక్షణనివ్వాలన్నారు.
‘పోక్సో’ ఉన్నా లేనట్లే...
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టాన్ని 2012లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు బలహీనంగా ఉంటున్నాయని, నేరస్తులు తేలిగ్గా తప్పించుకొనేందుకు అవకాశం కల్పించేలా నమోదవుతున్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. మరోవైపు ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో బాధిత కుటుంబాలను తరచూ పోలీస్‌స్టేషన్‌లకు రప్పించడం, మానసిక ఒత్తిడికి గురి చేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయన్నారు. ‘అత్యాచారాలకు గురైన చిన్నారులకు వైద్య సదుపాయంతో పాటు, మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలి. పిల్లల భావి జీవితానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి. తగిన పరిహారం అందజేయాలి. ఒక్క పోలీసులే కాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖ, తదితర విభాగాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి, బాధిత కుటుంబాలకు భరోసాను ఇవ్వాలి, అయితే ఇలాంటి పునరావాస, పరిహార చర్యలు ఏవీ చోటుచేసుకోవడం లేదని, పోలీసులు కేసులు నమోదు చేయడం వరకే పరిమితమవుతున్నాయి’ అని అచ్యుతరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment