
మృతదేహాన్ని పరిశీలిస్తున్న నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, సీఐ బ్రహ్మయ్య
తాడేపల్లిరూరల్(మంగళగిరి): మృత దేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసిన ఘటన తాడేపల్లి మండల పరిధిలోని రాధారంగా నగర్‌లో బుధవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు తాడేపల్లి సీఐ బ్రహ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని కవర్ చుట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అనంతరం నార్త్‌జోన్ డీఎస్పీ రామకృష్ణకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ నుంచి కిందపడి చనిపోయి ఉండవచ్చా.. లారీ తొక్కి ఉండవచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు లారీ క్లీనర్ అయి ఉంటాడని, 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చన్నారు. ఎటువంటి ఆధారాలు లభించ లేదు.
మృతుడి ఒంటిపై సిమెంటు రంగు ప్యాంటు, నల్ల బన్నీను, మెడలో అయ్యప్పస్వాములు ధరించే నల్లని వస్త్రం ఉంది. చనిపోయింది లారీ క్లీనర్ అయితే నేల బురదగా ఉండగా, లారీ కింద ఎందుకు పడుకుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ప్లాస్టిక్ సంచులు కప్పుకొని పడుకుంటే లారీ తొక్కి వెళ్లిందా?.. ఆ సంచుల్లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడవేస్తే, గుర్తు తెలియని వాహనం తొక్కివెళ్లిందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.