Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం.. | Ashay Bhave's Thaili Startup Success Story In Plastic Waste Prevention | Sakshi
Sakshi News home page

Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..

Published Fri, Aug 30 2024 11:31 AM | Last Updated on Fri, Aug 30 2024 11:31 AM

Ashay Bhave's Thaili Startup Success Story In Plastic Waste Prevention

పర్యావరణ హిత

ప్లాస్టిక్‌ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక  పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్‌ భవే. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి స్నీకర్స్‌ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..

మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.

‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.
‘ప్లాస్టిక్‌ సంచులను సరిగ్గా రీసైకిల్‌ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్‌ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్‌ను స్నీకర్స్‌ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్‌ భవే.

షూస్‌కు సంబంధించిన సోల్‌ను ఇండస్ట్రియల్‌ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్‌ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్‌ను రీసైకిల్‌ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్‌బాల్‌ స్నీకర్‌ ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’  స్నీకర్‌ డిజైన్‌ చేశారు. డిస్కౌంట్‌ కావాలనుకునేవారు పాత స్నీకర్‌లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్‌ ప్రత్యేకత. ఆశయ్‌ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్‌తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్‌ అవార్డ్‌ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్‌లో పోటీ పడడడం అంత తేలిక కాదు.

లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్‌ జస్ట్‌ డూ ఇట్‌ డూ ఇట్‌ రైట్‌’ అనేది కంపెనీ నినాదం.
‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్‌ భవే. న్యూయార్క్‌లోని ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సు చేశాడు ఆశయ్‌. ఈ స్టార్టప్‌ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్‌స్పైరింగ్‌ స్టార్టప్‌. యూనికార్న్‌ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్‌ భావేను ప్రశంసించాడు ఆనంద్‌ మహీంద్ర.

ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..
‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ప్రాడక్ట్‌గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్‌ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్‌ చేసింది.

ఇవి చదవండి: ముగ్గురు పాక్‌ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement