సాక్షి, గుంటూరు, విజయవాడ : ప్రేమించి పెళ్లాడిన భర్త ఆరేళ్ల తర్వాత వదిలేసి మరొక యువతితో సహజీవనం చేస్తున్న వ్యవహారాన్ని భార్య వెలుగులోకి తీసుకొచ్చిన ఘటన తాడేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. భర్త మరో యువతితో సహజీవనం చేస్తూ, తాడేపల్లి పట్టణ పరిధిలోని గౌతమి అపార్టుమెంట్‌లో అద్దెకుంటున్న ఇంటివద్ద తన కూతురితో కలిసి రెండు గంటల పాటు ధర్నా చేసింది. బాధిత యువతి చెప్పిన వివరాల ప్రకారం... విజయవాడలో నివసించే సూరపనేని చైతన్య, సరితకు 6 సంవత్సరాల కిందట పరిచయమయ్యాడు. పరిచయమైన నెలరోజులకే వివాహం చేసుకుంటానంటూ వెంటబడి, తన తల్లి శైలజతో ఇంటికొచ్చి పెద్దలను ఒప్పించి, 13–08–2013న వివాహం చేసుకున్నాడు.
అనంతరం ఓ పాప పుట్టగానే కట్నం డబ్బులతో పాటు ఒంటిమీద ఉన్న బంగారాన్ని సైతం వ్యాపారం పెట్టాలని తీసుకొని ఉడాయించాడని సరిత కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. నెల రోజుల క్రితం విజయవాడలో ఓ అమ్మాయితో కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టామని, నా పక్కన ఎటువంటి అమ్మాయి లేదని బుకాయించాడని, తిరిగి మరలా తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని గౌతమి అపార్ట్‌మెంట్‌లో వేరే అమ్మాయితో నివాసం ఉంటున్నాడని తెలిసి, ఇక్కడకొచ్చి చూడగా ఇక్కడే ఉన్నాడని తెలిపింది. ఇంట్లో నుంచి బయటకు రమ్మంటే రావడంలేదంటూ సరిత తెలియచేసింది.
విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్న సరితను విరమించి, పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరగా, ముందు ఇంట్లో ఉన్న చైతన్యను, సహజీవనం చేస్తున్న మహిళను బయటకు తీసుకురావాలంటూ డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా చైతన్యను అరెస్టు చేస్తేనే ఇక్కడ నుంచి కదులుతానంటూ భీష్మించుకుకూర్చోడంతో పోలీసులు చేసేదేం లేక సూరపనేని చైతన్యను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ సమయంలో సరిత ఇట్లాంటి మోసగాడ్ని చెప్పులతో కొడితే తప్ప బుద్ధిరాదని, కోటి రూపాయల కట్నం తీసుకొని, ఒక కూతుర్ని కన్నతర్వాత ఇద్దరి జీవితాలను నాశనం చేసాడని, చెప్పు తీసుకొని చైతన్య వెంట పడింది. పోలీసులు ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు.
అమ్మా... నాన్న చంపేస్తాడు... వెళ్లిపోదాంపద...
సరితతోపాటు ధర్నా చేస్తున్న ఆరేళ్ల పాప అమ్మా, నాన్న చంపేస్తాడు. మనం ఇక్కడ నుంచి పారిపోదాంపద. నాన్న ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాడు. నాకు కనిపించాడు. నాకు వేలు చూపిస్తున్నాడు. అంతకుముందు కొట్టినట్టు నిన్ను, నన్ను ఇద్దర్నీ కొడతాడు. నువ్వు ఏడుస్తుంటే అందరూ మన వంకే చూస్తున్నారు. అలా నువ్వు ఏడవకు. మనిద్దరం వేరే ఉందాం పద అంటూ కూతురు తల్లిని పట్టుకొని బతిమిలాడుతుంది. తల్లి సరిత కూతురితో దిగిన ఫొటోలను మీడియా వారికి చూపిస్తుంటే, ఆ ఫొటోలు చూపించవద్దంటూ ఆ పాప మారాం చేసింది. చివరకు తండ్రి రాకను గమనించిన ఆ చిన్నారి తల్లిని విడిచిపెట్టి పరుగులు తీస్తూ కారెక్కి కూర్చుంది. అక్కడున్న వారందరూ పాప భయాన్ని చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు. చిన్న పాపను ఏ విధంగా హింసించాడో దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment