సాక్షి, పట్నంబజారు (గుంటూరు): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. పట్టాభీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతికి చెందిన బొమ్మనబోయిన ఇంద్రాణి ప్రస్తుతం విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త నాగేంద్రనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఆమె గృహిణిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
పీజీ చదివి ఖాళీగా ఉంటున్న ఆమెకు వరుసకు మామయ్య అయిన తెల్లగడ్డల సత్యనారాయణ తనకు పరిచయం ఉన్న సెంట్రల్ ఇంటిలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న కొరడా నాగశ్రీనివాసరావు ద్వారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో గ్రూప్–2 కేడర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ. 15 లక్షలు ఒకసారి, పలుమార్లు ఖర్చుల నిమిత్తం రూ. 8 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్న క్రమంలో డీఎస్పీ నాగశ్రీనివాసరావు ఇటువంటి పనులు చేస్తుంటాడని, డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటాడని సమాచారం తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతోపాటు తన భర్తకు పరిచయం ఉన్న పాలకొల్లు రాజేశ్వరరావుకు తక్కువ వడ్డీకు డబ్బులు ఇప్పిస్తామని నమ్మబలికి పర్సంటేజీ కింద రూ. 9 లక్షలు, ఖర్చుల నిమిత్తం రూ. 14వేలు తీసుకున్నారని ఆరోపించారు. అతనికి సంబంధించి చెక్కులు కూడా ఇచ్చారని, అయితే అవి చెల్లకపోగా, ఉద్యోగం, రుణం కూడా రాలేదని, తమను మోసం చేసిన డీఎస్పీ నాగశ్రీనివాసరావుతో పాటు, తెల్లగడ్డల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment