ఉద్యోగం ఇస్తాం.. కానీ జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు ఉద్యోగార్థులే విరాళంగా చెల్లించాలి.. అవును మీరు విన్నది నిజమే. ఇవి ఏకంగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పిన మాటలు. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు దరఖాస్తులు కోరారు. ఈమేరకు చేసిన వినూత్న ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నాం. ఈ పొజిషన్‌లో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగార్థులకు పూర్వానుభవం అవసరంలేదు. తమ స్థానంలో చేరిన తర్వాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది’ అన్నారు.
ఉద్యోగి రూ.20 లక్షలు విరాళం
‘ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి ఏడాది ఎలాంటి వేతనం ఉండదు. పైగా ఆ వ్యక్తి రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి కోరికమేరకు జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళం ఇస్తుంది. రెండో ఏడాది నుంచి మాత్రం రూ.50 లక్షలకు తగ్గకుండా ఆ ఉద్యోగికి వేతనం చెల్లిస్తాం’ అని దీపిందర్ తెలిపారు.
ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
రెజ్యూమె అవసరం లేదు
‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు రెజ్యూమె పంపాల్సిన అవసరంలేదు. 200 పదాలకు తగ్గకుండా తమ వివరాలు తెలియజేస్తూ కవర్ లెటర్ పంపించాలి. దీన్ని d@zomato.comకు పంపించాలి’ అని చెప్పారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రూ.20 లక్షలు ఫీజు పెట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులను దూరం చేస్తున్నట్లేనని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌ను దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటూ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment