Central Intelligence
-
ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. పట్టాభీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతికి చెందిన బొమ్మనబోయిన ఇంద్రాణి ప్రస్తుతం విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త నాగేంద్రనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఆమె గృహిణిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పీజీ చదివి ఖాళీగా ఉంటున్న ఆమెకు వరుసకు మామయ్య అయిన తెల్లగడ్డల సత్యనారాయణ తనకు పరిచయం ఉన్న సెంట్రల్ ఇంటిలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న కొరడా నాగశ్రీనివాసరావు ద్వారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రూప్–2 కేడర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ. 15 లక్షలు ఒకసారి, పలుమార్లు ఖర్చుల నిమిత్తం రూ. 8 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్న క్రమంలో డీఎస్పీ నాగశ్రీనివాసరావు ఇటువంటి పనులు చేస్తుంటాడని, డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటాడని సమాచారం తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు తన భర్తకు పరిచయం ఉన్న పాలకొల్లు రాజేశ్వరరావుకు తక్కువ వడ్డీకు డబ్బులు ఇప్పిస్తామని నమ్మబలికి పర్సంటేజీ కింద రూ. 9 లక్షలు, ఖర్చుల నిమిత్తం రూ. 14వేలు తీసుకున్నారని ఆరోపించారు. అతనికి సంబంధించి చెక్కులు కూడా ఇచ్చారని, అయితే అవి చెల్లకపోగా, ఉద్యోగం, రుణం కూడా రాలేదని, తమను మోసం చేసిన డీఎస్పీ నాగశ్రీనివాసరావుతో పాటు, తెల్లగడ్డల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అమిత్‌షాపై దాడిలో భద్రతా వైఫల్యం!
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుపతిలో శుక్రవారం జరిగిన టీడీపీ కార్యకర్తల దాడితో ఏపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి జడ్ ప్లస్ కేటగిరి రక్షణ వ్యవస్థ కలిగిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనలో భద్రతను గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అలిపిరి వద్ద చోటుచోసుకున్న ఈ ఘటన ఏపీ పోలీసు వ్యవస్థలోని డొల్లతనం బయటపడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షా కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు రువ్వడంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ)వర్గాలు ఆరా తీశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు బీజేపీ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నెల 12న ఏపీ పోలీస్ టెక్ భవనాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాను తలుచుకుంటే కేంద్ర వాహనాలు తిరగనివ్వననే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల పలు సభల్లో చంద్రబాబు నుంచి మంత్రులు వరకు అందరూ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు గుర్తించాయి. అలిపిరి ఘటనలో పాల్గొన్నది ఎవరు? వారికి వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు? అనే కోణాల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల తీరుపై కూడా వారు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అలాగే, దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఏపీ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ నివేదిక కోరినట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ హోం మంత్రి చినరాజప్ప దాడి జరగలేదని ప్రకటించడం వివాదాస్పదమైంది. -
ద్వారకపై ఉగ్ర గురి
అహ్మదాబాద్: గుజరాత్ లోని ద్వారక గుడిపై దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయి. కేంద్ర నిఘా సంస్ధ(సీఐ) బుధవారం అందించిన సమాచారం మేరకు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ సంస్ధ ఐఎస్ఐ ద్వారక గుడిపై పెద్ద దాడికి కుట్ర పన్నినట్లు సమాచారం ఉందని సీఐ తెలిపింది. గుడిలో నరమేథం సృష్టించేందుకు ఇప్పటికే 12 నుంచి 15 మంది ముష్కరులు గుజరాత్ తీర ప్రాంతానికి చేరుకుని ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ద్వారకా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ముష్కరులు నక్కి ఉండే అవకాశం కూడా ఉందని తెలిపింది. దీంతో అధికారులు తీర ప్రాంత గస్తీని పెంచారు. రెండు అనుమానాస్పద చేపల పడవలు భారత జలాల్లోకి ప్రవేశించడానికి వేడి చూస్తున్నట్లు కూడా సీఐకు సమాచారం ఉంది. ఈ విషయంపై కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసులకు సీఐ సమాచారం అందించినట్లు తెలిసింది. -
టార్గెట్ తమిళనాడు!
చెన్నై, సాక్షి ప్రతినిధి: దక్షిణాది రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు సరిహద్దు అడవుల్లో సంచరిస్తున్న మావోయిస్టులు ప్రధానంగా తమిళనాడుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఐదు బృందాలుగా ఏర్పడి అదను కోసం వేచిఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర పోలీస్ యాంత్రాగాన్ని అప్రమత్తం చేశాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల కదలికలను పోలీస్‌శాఖ ఏనాడో గుర్తించింది. వీరందరూ అధునాతన ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఒకటిరెండు వారాల్లో భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. తమిళనాడుతోపాటు, కేరళ, కర్ణాటకలో సైతం నిఘా పెంచారు. భారత్‌లో మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఛండీఘర్, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మావోయిస్టులను అదుపుచేసేందుకు ఏర్పడిన కోబ్రా భద్రతాదళం వారిపై దాడులకు సిద్ధపడగానే స్థావరాన్ని మార్చేస్తున్నారు. కూంబింగ్‌లో మావోయిస్టులు పట్టుబడకున్నా వారి కార్యకలాపాలను మాత్రం కట్టడిచేయగలిగారు. అయితే ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాల అటవీ, పోలీస్ యంత్రాంగ నిఘా మందగించడం, ఉత్తరాది రాష్ట్రాల్లో పోలీస్‌శాఖ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడుల వల్ల మావోయిస్టులు దక్షిణాదిపైనే అందునా తమిళనాడుపైనే గురిపెట్టినట్లు కేంద్రం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో దాడులకు దలాం అనే సాయుధ బృందాలను మావోయిస్టులు సిద్ధం చేసుకున్నారు. కబినీ, నడుకానీ, భవానీ దళాలు, సురేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి నేతృత్వంలో మరో రెండు దళాలు సిద్ధమయ్యూయి. ఒక్కో దళంలో 50 మంది మావోయిస్టులు సభ్యులుగా ఉన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను ఐదు విభాగాలుగా విభజించి దళాల శిబిరాలను సిద్ధం చేసుకున్నారు. ఒక్కో దళంలో సుమారు 45 మంది పురుషులు, 15 మంది స్త్రీలు ఉన్నారి అంచనావేశారు. ఆధునిక ఆయుధాల ప్రయోగం, చేతి బాంబులు, లాండ్మైన్ల వాడకంలో వీరంతా పూర్తిగా శిక్షణ పొందినట్లు పోలీసులు తెలుసుకున్నారు. మూడు రాష్ట్రాలను కలిపే అటవీ సరిహద్దులోని 65 ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజన్స్ నిర్ధారించుకుంది. ఒకటి లేదా రెండువారాల్లో పెద్ద ఎత్తున దాడులకు దిగేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారని మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర ం అప్రమత్తం చేసింది. ఈ సమాచారంతో తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు ఆందోళనలో పడ్డారు. తమిళనాడు సరిహద్దుల్లోని పాలక్కాడు, సత్యమంగళం, ధర్మపురి, కృష్ణగిరి, హోసూరు, కుముళి, శ్రీపెరంబుదూరు, కలియక్కావిళై, పుళియరై తదితర ప్రాంతాల్లో పడమర వైపున ఉన్న పోలీస్, అటవీశాఖ కార్యాలయాలపై దాడులకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారుజాము 5 గంటల్లోగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఆయా ప్రాంతాల్లోని అటవీ, పోలీస్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అత్యాధునిక ఆయుధాలను అందజేసినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మావోయిస్టులను పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సరిహద్దుల అడవుల్లో భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. అటవీ గ్రామాల ప్రజల సహకారంతో మావోయిస్టుల ఉనికిని కనుగొనేందుకు ఇంటెలిజన్సె వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలీస్‌శాఖలో ఎవ్వరూ సెలవు తీసుకోరాదని, సెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు అందాయి. తమిళనాడు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాళీదాస్, పద్మ, వేల్మురుగన్, పళనివేలు, కార్తిక్‌ల ఆచూకీ తెలుసుకునేందుకు వారికి అండగా నిలిచేవారి సహకారాన్ని తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. -
తీవ్రవాది అరెస్ట్
చెన్నైలో అనేక విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఐఎస్ఐ తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి జాతీయ భద్రతా దళ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇతని నుంచి పెద్ద ఎత్తున సమాచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కొంతకాలంగా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందుతోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు చెన్నైని జల్లెడ పడుతూనే ఉన్నారు. భారత రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న తంజావూరుకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాది తమీమ్ అన్సారీని 2012లో పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చి నుంచి శ్రీలంకకు పారిపోతుండగా వలపన్ని పట్టుకున్నారు. తంజావూరులో ఒకప్పుడు ఎర్రగడ్డల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న అన్సారీకి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు మొదలయ్యూయి. అలాగే కొన్ని నెలల క్రితం చెన్నై తిరువల్లిక్కేనీలో దాక్కున్న తీవ్రవాది జాకీర్‌హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. ఇతనిచ్చిన సమాచారంతో అనుచరులు సలీం, శివబాలన్ పట్టుపడ్డారు. ఇలా వరుసగా తీవ్రవాదులు పట్టుపడుతున్న నేపథ్యంలో మరో కీలక వ్యక్తి నగరంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. నగరంలో గాలింపు చర్యల్లో ఉన్న జాతీయ భద్రాతా దళాల వారు అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. శ్రీలంక నుంచి మూడేళ్ల క్రితమే చెన్నైకి చేరుకున్న అరుణ్ సెల్వరాజ్ ఎవరికీ అనుమానం రాకుండా ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. మరోపక్క చెన్నైలోని ముఖ్య ప్రదేశాలను ఫొటోలు తీసి పాకిస్థాన్‌కు పంపేవాడు. పరంగిమలైలోని సైనిక శిక్షణ కేంద్రం, జాతీయ భద్రతా దళాల క్యాంప్, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలు ఇతను తీసిన ఫొటోల్లో ఉన్నాయి. ఈ ఫొటోలు ఇతర సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసేందుకు ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, శ్రీలంక నుంచి తీసుకున్న పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ సెల్వరాజ్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి మోని ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గతంలో అరెస్టయిన జాకీర్‌హుస్సేన్, శివబాలన్, తాలిక్, రబీక్లను పోలీస్ కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరగా 25వ తేదీ వరకు విచారణకు న్యాయమూర్తి అనుమతించారు. బాంబు బూచీలు నగరంలో తీవ్రవాదుల అరెస్ట్‌లు ఒకవైపు కొనసాగుతుండగా కొందరు ఆకతాయిలు బాంబు బూచీలతో ఆడుకుంటున్నారు. సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 4,5 ఫ్లాట్‌ఫారాల్లో మరికొంత సేపట్లో బాంబులు పేలనున్నాయంటూ చెన్నై జాంబజార్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి బుధవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఫోన్ వచ్చింది. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా హుటాహుటిన పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజాము 5 గంటల వరకు సెంట్రల్లో తనిఖీలు చేపట్టి ఆకతాయి చేష్టగా తీర్మానించారు. అలాగే తిరువత్తియూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మరికొద్దిసేపట్లో బాంబులు ఉన్నాయి, కాపాడండీ అంటూ విదేశం నుంచి ఫోన్ వచ్చింది. విద్యార్థులను క్లాసు రూముల నుంచి బయటకు పంపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అదికూడా ఆకతాయి పనేనని తేలింది. -
విద్యుత్ కేంద్రాల భద్రత గాలికి
=సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆదేశాలు బేఖాతర్ =మావోయిస్టుల నుంచి ముప్పు =తరచూ దొంగతనాలు సీలేరు, న్యూస్‌లైన్ : రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తూ రూ.వేల కోట్ల ఆదాయం ఇస్తున్న విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రం భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో దొంగదారుల మధ్య విద్యుత్ వెలుగులు నింపుతోంది. సీలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో అంతర్రాష్ట్ర రోడ్డుకు ఆనుకొని రెండు కొండల మధ్య రెండు హెక్టార్లలో 1968లో విదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం చేపట్టిన ఈ జలవిద్యుత్ కేంద్రం ఎన్నో అవార్డులు సాధించించింది. అలాంటి విద్యుత్ కేంద్రం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఉగ్రవాదుల, మావోయిస్టుల దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాలపై మావోయిస్టులు దాడులకు పాల్పడి కోట్లాది రూపాయలు నష్టం కలిగించినా వాటికి రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ దాడులు అనంతరం సెంట్రల్ ఇంటెలీజెన్స్ అధికారులు విద్యుత్ కేంద్రాలను పరిశీలించి భద్రత మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. 2005లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని మావోయిస్టులు పేల్చివేసిన అనంతరం సెంట్రల్ ఇంటెలిజెన్స్ బృందం పరిశీలించి ఈ కేంద్రం చుట్టూ మెటల్ డిటెక్టర్ కంచెను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ జెన్కో సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దొంగదారుల్లో చోరీలు... సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో తరచూ దొంగదారుల్లో చోరీలు జోరుగా సాగుతున్నాయి. విద్యుత్ కేంద్రం చుట్టూ భద్రత లేకపోవడంతో ఈ దొంగతనాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువయిన విదేశీ పరికరాలు, విలువైన సామాగ్రి దొంగల పాలవుతున్నాయి. గతేడాది విద్యుత్ కేంద్రంలో వేసిన తాళాలు వేసినట్టు ఉండగానే రూ.లక్షల విలువ చేసే కాపర్ పరికరాలు మాయమయ్యాయి. దీంతో ఈ సంగతి తెలిస్తే తమకెక్కడ ఉచ్చు బిగుస్తుందోనన్న భయంతో బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కేంద్రం చుట్టూ ముళ్ల కంచె ఉండడంతోనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల కిందట విద్యుత్ కాంప్లెక్స్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించేందుకు రూ.కోటి 40 లక్షలు నిధులు మంజూరు చేశారు. వాటిని అక్కడి ఉద్యోగుల ఇళ్లకు మాత్రమే రక్షణ గోడ నిర్మించారని, విద్యుత్ కేంద్రానికి మాత్రం నిర్మించలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి జలవిద్యుత్ కేంద్రాలకు గట్టి భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై జలవిద్యుత్ కేంద్రం భద్రతా అధికారి కోటేశ్వరరావును వివరణ కోరగా భద్రత మరింత కట్టుదిట్టం చేశామని, నిరంతరం నలుగురు హోంగార్డులు విధుల్లో ఉంటున్నార న్నారు. వచ్చిపోయే వారిని తనిఖీలు చేపట్టి విడిచి పెడుతున్నామని చెప్పారు.