తీవ్రవాది అరెస్ట్ | Terrorist's Arrest in Chennai | Sakshi
Sakshi News home page

తీవ్రవాది అరెస్ట్

Published Fri, Sep 12 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

తీవ్రవాది అరెస్ట్

తీవ్రవాది అరెస్ట్

చెన్నైలో అనేక విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఐఎస్‌ఐ తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి జాతీయ భద్రతా దళ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇతని నుంచి పెద్ద ఎత్తున సమాచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కొంతకాలంగా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందుతోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు చెన్నైని జల్లెడ పడుతూనే ఉన్నారు. భారత రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న తంజావూరుకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాది తమీమ్ అన్సారీని 2012లో పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చి నుంచి శ్రీలంకకు పారిపోతుండగా వలపన్ని పట్టుకున్నారు. తంజావూరులో ఒకప్పుడు ఎర్రగడ్డల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న అన్సారీకి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు మొదలయ్యూయి.
 
 అలాగే కొన్ని నెలల క్రితం చెన్నై తిరువల్లిక్కేనీలో దాక్కున్న తీవ్రవాది జాకీర్‌హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. ఇతనిచ్చిన సమాచారంతో అనుచరులు సలీం, శివబాలన్ పట్టుపడ్డారు. ఇలా వరుసగా తీవ్రవాదులు పట్టుపడుతున్న నేపథ్యంలో మరో కీలక వ్యక్తి నగరంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. నగరంలో గాలింపు చర్యల్లో ఉన్న జాతీయ భద్రాతా దళాల వారు అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. శ్రీలంక నుంచి మూడేళ్ల క్రితమే చెన్నైకి చేరుకున్న అరుణ్ సెల్వరాజ్ ఎవరికీ అనుమానం రాకుండా ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు.
 
 మరోపక్క చెన్నైలోని ముఖ్య ప్రదేశాలను ఫొటోలు తీసి పాకిస్థాన్‌కు పంపేవాడు. పరంగిమలైలోని సైనిక శిక్షణ కేంద్రం, జాతీయ భద్రతా దళాల క్యాంప్, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలు ఇతను తీసిన ఫొటోల్లో ఉన్నాయి. ఈ ఫొటోలు ఇతర సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసేందుకు ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, శ్రీలంక నుంచి తీసుకున్న పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ సెల్వరాజ్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి మోని ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గతంలో అరెస్టయిన జాకీర్‌హుస్సేన్, శివబాలన్, తాలిక్, రబీక్‌లను పోలీస్ కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరగా 25వ తేదీ వరకు విచారణకు న్యాయమూర్తి అనుమతించారు.
 
 బాంబు బూచీలు
 నగరంలో తీవ్రవాదుల అరెస్ట్‌లు ఒకవైపు కొనసాగుతుండగా కొందరు ఆకతాయిలు బాంబు బూచీలతో ఆడుకుంటున్నారు. సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 4,5 ఫ్లాట్‌ఫారాల్లో మరికొంత సేపట్లో బాంబులు పేలనున్నాయంటూ చెన్నై జాంబజార్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి బుధవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఫోన్ వచ్చింది. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా హుటాహుటిన పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజాము 5 గంటల వరకు సెంట్రల్‌లో తనిఖీలు చేపట్టి ఆకతాయి చేష్టగా తీర్మానించారు. అలాగే తిరువత్తియూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మరికొద్దిసేపట్లో బాంబులు ఉన్నాయి, కాపాడండీ అంటూ విదేశం నుంచి ఫోన్ వచ్చింది. విద్యార్థులను క్లాసు రూముల నుంచి బయటకు పంపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అదికూడా ఆకతాయి పనేనని తేలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement