చెన్నై, సాక్షి ప్రతినిధి: దక్షిణాది రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు సరిహద్దు అడవుల్లో సంచరిస్తున్న మావోయిస్టులు ప్రధానంగా తమిళనాడుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఐదు బృందాలుగా ఏర్పడి అదను కోసం వేచిఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర పోలీస్ యాంత్రాగాన్ని అప్రమత్తం చేశాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల కదలికలను పోలీస్‌శాఖ ఏనాడో గుర్తించింది. వీరందరూ అధునాతన ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఒకటిరెండు వారాల్లో భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. తమిళనాడుతోపాటు, కేరళ, కర్ణాటకలో సైతం నిఘా పెంచారు. భారత్‌లో మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఛండీఘర్, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మావోయిస్టులను అదుపుచేసేందుకు ఏర్పడిన కోబ్రా భద్రతాదళం వారిపై దాడులకు సిద్ధపడగానే స్థావరాన్ని మార్చేస్తున్నారు. కూంబింగ్‌లో మావోయిస్టులు పట్టుబడకున్నా వారి కార్యకలాపాలను మాత్రం కట్టడిచేయగలిగారు.
అయితే ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాల అటవీ, పోలీస్ యంత్రాంగ నిఘా మందగించడం, ఉత్తరాది రాష్ట్రాల్లో పోలీస్‌శాఖ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడుల వల్ల మావోయిస్టులు దక్షిణాదిపైనే అందునా తమిళనాడుపైనే గురిపెట్టినట్లు కేంద్రం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో దాడులకు దలాం అనే సాయుధ బృందాలను మావోయిస్టులు సిద్ధం చేసుకున్నారు. కబినీ, నడుకానీ, భవానీ దళాలు, సురేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి నేతృత్వంలో మరో రెండు దళాలు సిద్ధమయ్యూయి. ఒక్కో దళంలో 50 మంది మావోయిస్టులు సభ్యులుగా ఉన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను ఐదు విభాగాలుగా విభజించి దళాల శిబిరాలను సిద్ధం చేసుకున్నారు. ఒక్కో దళంలో సుమారు 45 మంది పురుషులు, 15 మంది స్త్రీలు ఉన్నారి అంచనావేశారు. ఆధునిక ఆయుధాల ప్రయోగం, చేతి బాంబులు, లాండ్‌మైన్ల వాడకంలో వీరంతా పూర్తిగా శిక్షణ పొందినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
మూడు రాష్ట్రాలను కలిపే అటవీ సరిహద్దులోని 65 ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజన్స్ నిర్ధారించుకుంది. ఒకటి లేదా రెండువారాల్లో పెద్ద ఎత్తున దాడులకు దిగేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారని మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర ం అప్రమత్తం చేసింది. ఈ సమాచారంతో తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు ఆందోళనలో పడ్డారు. తమిళనాడు సరిహద్దుల్లోని పాలక్కాడు, సత్యమంగళం, ధర్మపురి, కృష్ణగిరి, హోసూరు, కుముళి, శ్రీపెరంబుదూరు, కలియక్కావిళై, పుళియరై తదితర ప్రాంతాల్లో పడమర వైపున ఉన్న పోలీస్, అటవీశాఖ కార్యాలయాలపై దాడులకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారుజాము 5 గంటల్లోగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.
ఆయా ప్రాంతాల్లోని అటవీ, పోలీస్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అత్యాధునిక ఆయుధాలను అందజేసినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మావోయిస్టులను పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సరిహద్దుల అడవుల్లో భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. అటవీ గ్రామాల ప్రజల సహకారంతో మావోయిస్టుల ఉనికిని కనుగొనేందుకు ఇంటెలిజన్సె వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలీస్‌శాఖలో ఎవ్వరూ సెలవు తీసుకోరాదని, సెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు అందాయి. తమిళనాడు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాళీదాస్, పద్మ, వేల్‌మురుగన్, పళనివేలు, కార్తిక్‌ల ఆచూకీ తెలుసుకునేందుకు వారికి అండగా నిలిచేవారి సహకారాన్ని తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
టార్గెట్ తమిళనాడు!
Published Fri, Jan 2 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement