అక్కడ ఆలస్యంగా జియో సేవలు
ముంబై : టెలికాం రంగంలోకి దూకుడుగా వస్తున్న రిలయన్స్ జియో సేవలు అన్ని రాష్ట్రాల్లో వాణిజ్యపరమైన లాంచింగ్ కు సన్నద్ధమవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ సేవలు తొందర్లేనే యూజర్లకు అందుబాటులోకి వస్తుండగా.. నాలుగురాష్ట్రాల్లో మాత్రం ఆలస్యంగా ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తుది ఆమోదాన్ని జూలై 7నే టెలికాం విభాగం నుంచి కంపెనీ పొందిందని, అయితే ఈ నాలుగు సర్కిల్స్ లో టెలికాం సేవలను విస్తరించడానికి ఇంకా నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని రిలయన్స్ జియో ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ అన్షుమాన్ థాకూర్ శుక్రవారం తెలిపారు. ఇతర సర్కిల్స్ లో నెట్ వర్క్ సంసిద్ధత బాగున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ సేవలు ఎప్పటినుంచి ప్రారంభించబోతున్నారో వెల్లడించలేదు. మొదటి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయాలను పేర్కొన్నారు.
రిలయన్స్ జియో సేవలు కమర్షియల్ గా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టులోనే ప్రారంభించనున్నట్టు జియో ప్లాన్ కు సంబంధించిన అధికారులు చెప్పినట్టు ఈటీ నౌ రిపోర్టు చేసింది. 2010 ఎయిర్ వేవ్స్ ఆక్షన్ ను అనంతరం రిలయన్స్ టెలికాం రంగంలోకి పునఃప్రవేశించింది. దాదాపు ఆరేళ్ల అనంతరం కంపెనీ ఈ సేవలను ప్రారంభించబోతోంది. రూ.1.34లక్షల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్ల వరకూ ఈ నెట్ వర్క్ ను విస్తరించడానికి, స్పెక్ట్రమ్, ఇతర ఖర్చుల కోసం జియో పెట్టుబడులు పెట్టింది.
ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో 15 లక్షల మందికి పైగా టెస్ట్ యూజర్లు ఉన్నట్లు అంచనా. కాగా, రానున్న నెలల్లో ఈ ప్రయోగాత్మక సేవలను పూర్తిస్థాయి వాణిజ్య సేవల్లోకి అప్‌గ్రేడ్ చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్ సందర్భంగా యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 26 జీబీగా ఉన్నట్లు తెలిపింది. ఇక సగటు నెలవారీ వాయిస్ వినియోగం 355 నిమిషాలుగా నమోదైనట్లు వెల్లడించింది.