పంచ పద్మాలు | Womens Padma Shri Awards Winners | Sakshi
Sakshi News home page

పంచ పద్మాలు

Published Thu, Jan 30 2020 12:50 AM | Last Updated on Thu, Jan 30 2020 8:28 AM

Womens Padma Shri Awards Winners - Sakshi

కథానాయిక

మూళిక్కళ్‌ పంకజాక్షి: పై పెదవి మీద తోలుబొమ్మను ఉంచుకుని, రామాయణ మహాభారత కథలను నాలిక మీద ఆడిస్తున్న ఏకైక కళాకారిణి కేరళకు చెందిన మూళిక్కళ్‌ పంకజాక్షి. తల్లిదండ్రులు నేర్పిన ‘నూక్కు విద్య పవక్కలి’ (తోలు బొమ్మలాట)ని ఆమె తన పన్నెండవ ఏట నుంచే కాపాడుకుంటూ వస్తున్నారు. కేరళలోని మోనిపల్లె తాలూకా కొట్టాయం వారిది. భర్త శివరామ పాణిక్కర్‌ కూడా కళాకారుడే. మధుర స్వరంతో శివరామ పాడుతూ, వాద్యాలను ఉపయోగించటం వల్లే తన కథకు మరింత అందం చేకూరి, తాను అందరికీ పరిచితురాలినయ్యాను అంటారు పంకజాక్షి. ఐదు వందల సంవత్సరాల నాటì  ఈ విద్యను, ఈ శతాబ్దంలో నేటికీ సజీవంగా ఉంచిన ఏకైక వ్యక్తి పంకజాక్షి. ఆమెను ఈ విద్య నేర్చుకోమని తల్లిదండ్రులు ఎన్నడూ ఒత్తిడి తీసుకురాలేదు.

మొదట్లో తన ఇంటిముందరే కాళ్లను బారచాచి, పైకి చూస్తూ, చిన్న చిన్న కొబ్బరి కాయ పిందెలను పైపెదవి మీద గంటలుగంటలు బ్యాలెన్స్‌ చేసేది. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్న సమయాలలో సాధన చేసిన పంకజాక్షి, వివాహం వల్ల కాని, పిల్లల వల్ల కాని ఎన్నడూ ఎటువంటి ఆటంకం కలగలేదని అంటారు. ఆమె మనుమరాలు కె. ఎస్‌. రంజని కూడా ఈ కళను కొనసాగిస్తున్నారు. పంకజాక్షి ఆరు సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ఈ విద్యను ప్రదర్శించటం లేదు. ఆసక్తి ఉన్నవారికి తన ఇంటి దగ్గర ఈ విద్యను నేర్పుతున్న పంకజాక్షికి పద్మశ్రీ అవార్డు లభించింది.

సంఘసేవిక

ఉషా చౌమర్‌:
మరుగుదొడ్లను పరిశుభ్ర పరిచే పని చేస్తున్న రోజుల్లో ఉషా చౌమర్‌కి, ఆ పని చేసి ఇంటికి వచ్చాక వాంతులు అయ్యేవి. ఏమీ తినాలనిపించేది కాదు. తనమీద తనకే అసహ్యం వేసేది. 1993లో తోటీ పనిని నిషేధించినా, కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ తోటీ పనివారు ఉన్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో ఒక సామాన్య దళిత తోటీ కుటుంబంలో పుట్టిన ఉషా తన ఏడవ ఏట నుంచే తల్లికి సహాయంగా చీపురు పట్టారు. పది సంవత్సరాల వయసులో గృహిణిగా ఆల్వార్‌ జిల్లా చేరుకున్నారు. భర్తకు సహాయంగా ఇదే పనిలో జీవితం కొనసాగింది. డా. బిందేశ్వర్‌ పాఠక్‌ అనే సంఘ సంస్కర్త ఉషా నివసించే కాలనీకి రావటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది.

ఆయన ‘నయీ దిశ’ పేరుతో స్థాపించిన సంస్థ ద్వారా ఉషా అప్పడాలు, నూడుల్స్, పచ్చళ్లు తయారుచేసి అమ్మకాలు ప్రారంభించారు. అలా తను కొత్త జీవితంలోకి వచ్చి తనలాంటి వారి జీవితాలలో వెలుగురేఖలు ప్రసరింప చేశారు. ఆంగ్లవిద్యను కూడా అభ్యసించిన ఉష.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, ఆయనకు రాఖీ కట్టిన తరువాత సామాజికవేత్తగా కూడా మారారు. అమెరికా, పారిస్, దక్షిణాఫ్రికా వంటి పలు దేశాలలో పర్యటిస్తూ, ఎంతోమందిని తోటీ పని నుంచి బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ సంస్థకు అధ్యక్షురాలిగా ఉంటున్న ఉష తన సేవలకుగాను ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు.

సౌభాగ్యవతి

ట్రినిటీ సయూవూ:
ఈశాన్య రాష్ట్రాలలోని మేఘాలయలో ములీ అనే చిన్న గ్రామంలో జన్మించిన ట్రినిటీ సయూవూ ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను చక్కదిద్దేవారు. అంతటితో తృప్తి చెందకుండా, నలుగురికీ ఉపయోగపడే పని కూడా మరేదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. పసుపు సాగును ఒక ఉద్యమంగా ప్రారంభించారు. లకడాంగ్‌ అనే పసుపు రకాన్ని పండించటం వల్ల మూడు రెట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలుసుకున్నారు. ట్రినిటీ సయూవూ ఈ విషయాన్ని మేఘాలయాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మందికి తెలియబరిచారు. ప్రతిరోజూ స్కూల్‌ అయిపోగానే, సాయంకాలం వేళ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే మహిళలను కలుసుకుని, ఈ బంగారు సుగంధ ద్రవ్యం (పసుపు) పంట పండించటం వల్ల వచ్చే అదనపు రాబడి గురించి వారికి ఆసక్తి కలిగేలా వివరించేవారు.

అధిక ఆదాయం వచ్చేలా, పసుపు కొమ్ములను స్వయంగా మిల్లులో పట్టించి, పసుపును కవర్లలో ప్యాకింగ్‌ చేసి, అమ్ముతున్నారు. సేంద్రియ పద్ధతిలో ఈ సాగు జరుగుతోంది. రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను తెలియచేస్తూ, తాము తయారు చేసిన పసుపును దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేసి, సంపన్నులవుతున్నారు ఆమె నుంచి స్ఫూర్తిని పొందినవారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించిన ట్రినిటీ సయూవూను పద్మశ్రీ పురస్కారం వరించి వచ్చింది.

ధాన్యలక్ష్మి

రహీబాయ్‌ సోమా:
సంకర విత్తనాల కంటె దేశీ విత్తనాల వల్లే సేంద్రియ వ్యవసాయం సాధ్యమని భావించారు మహారాష్ట్రలోని కొంభల్నే గ్రామానికి చెందిన రహీబాయ్‌ సోమా. ఆలోచనలను ఆచరణలో పెడితేనే ఏ వ్యక్తయినా ఉన్నతస్థాయికి చేరుకుంటారని ఆమె నమ్ముతారు. ఏడుగురు సభ్యులున్న రహీబాయ్‌ సోమా కుటుంబం ఉపాధికోసం ఔరంగాబాద్‌ జిల్లా ఆకోలే తాలూకాకు చేరుకున్నాక, కొత్త జీవితం ప్రారంభించారు. వర్షాకాలంలో వ్యవసాయం చేస్తూ, మిగతా సమయంలో పం^è దార ఫ్యాక్టరీలో రోజు కూలీలుగా పనిచేసేవారు కుటుంబంలోని వాళ్లంతా. అయితే ఆ జీవితం రహీబాయ్‌ సోమాకు నచ్చలేదు. వారి కున్న ఏడు ఎకరాలలో మూడు ఎకరాల మీద శ్రద్ధ పెట్టారు రహీబాయ్‌ సోమా. భూమి సారవంతంగా ఉంటేనే మంచి పంట దిగుబడి వస్తుందని ఆమెకు బాగా తెలుసు.

నేలను తడిగా ఉంచటం కోసం తన పొలంలో వ్యవసాయ చెరువును అంటే జలకుండాన్ని తవ్వించి, కూరగాయలు పండించటం ప్రారంభించారు. ఆమెలోని పట్టుదలను గమనించిన మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ రూరల్‌ ఏరియాస్‌ వారు ఆమెకు సహకరించారు. దానితో రహీబాయ్‌ సోమా కోళ్లఫారం, మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. పంటలు చక్కగా పండించటం కోసం దేశీ విత్తనాలను సంరక్షించటం కోసం విత్తనాల బ్యాంకును నెలకొల్పి, సీడ్‌ మదర్‌గా గుర్తింపు పొందారు. దాచిన విత్తనాలను పొరుగు రైతులకు ఇస్తూ, వారు కూడా ఫలితం పొందేందుకు సహకరిస్తున్న రహీబాయ్‌ సోమాను పద్మశ్రీ పురస్కారం వెతుక్కుంటూ వచ్చింది.

వనమాలి

తులసి గౌడ:
కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడకు ఏడుపదులు పైబడ్డా నేటికీ హుషారుగానే కనిపిస్తారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. పుట్టిన రెండేళ్లకే తండ్రిని పోగొట్టుకున్నారు. కుటుంబాన్ని నడపటం కష్టంగా ఉండటంతో, తులసి గౌడకు బాల్యంలోనే వివాహం చేశారు ఆమె తల్లి. ఆమెను అక్కడ కూడా దురదృష్టం వెంటాడింది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. అయినా ౖ«§ð ర్యాన్ని కోల్పోలేదు తులసి గౌడ. ఒంటరితనాన్ని దూరం చే సుకోవటం కోసం, మొక్కలకు చేరువైంది. ఆమెలోని ఉత్సాహాన్ని చూసి, అటవీశాఖ వారు ఆమెకు వనమాలి ఉద్యోగం ఇచ్చారు. మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంటూ, అంకిత భావంతో పనిచేశారు తులసి.

మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసి సంరక్షించటమే కాకుండా, ఆ మొక్కలోని గుణాలు, మొక్క పేరుకు సంబంధించిన జ్ఞానం పెంచుకున్నారు. ఎవరు వచ్చి, ఏ మొక్క గురించి ప్రశ్నించినా తడుముకోకుండా, విసుగు లేకుండా, ఆనందంగా ఆ వివరాలు చెబుతారు తులసి గౌడ. టేకు మొక్కలతో తన ప్రయాణం ప్రారంభించిన తులసి గౌడ, పనస వంటి అనేక పెద్ద పెద్ద మొక్కలు కూడా నాటి, అవి పెరిగి, ఫలాలనిస్తుంటే, తనకు మనుమలు పుట్టినంత ఆనందిస్తారు. పర్యావరణానికి అందించిన సేవలకు గాను ఆమెకు ఉన్న పురస్కారాలకు వన్నె తెచ్చేలా పద్మశ్రీ పురస్కారం వచ్చి చేరింది.
- డా. వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement