ఢిల్లీలోని చాందినీ మహల్‌లో మొబైల్ కరోనా నిర్ధారణ వాహనం వద్ద పరీక్షలు చేస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం తాము ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనలను కొన్ని రాష్ట్రాలు సరిగ్గా అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రాష్ట్రాలు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన నిబంధనలు విధించవచ్చు కానీ.. కేంద్రం ప్రకటించిన నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ముంబై, పుణెల్లో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, రాజస్తాన్‌లోని జైపూర్‌లో, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్, నార్త్ 24 పరగణ, డార్జిలింగ్, జల్‌పయిగురి, కలింపాంగ్‌ల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.
ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఆరు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయని సోమవారం ప్రకటించింది. వారు లాక్‌డౌన్ నిబంధనల అమలులో చోటు చేసుకున్న లొసుగులను గుర్తించి నివేదిక రూపొందిస్తారని పేర్కొంది. అలాగే, ఆయా ప్రాంతాల్లో కోవిడ్–19 చికిత్స కోసం తీసుకున్న చర్యలు, వైద్యులకు అవసరమైన పీపీఈల అందుబాటు.. మొదలైనవాటిని సమీక్షిస్తారని తెలిపింది.
అనంతరం, అవసరమైన చర్యలపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తాయని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అదనపు కార్యదర్శి హోదాతో ఉన్న అధికారి నేతృత్వంలోని ఒక్కో బృందంలో ఐదుగురు అధికారులు ఉంటారని పేర్కొంది. ఆయా అధికారులకు వసతులను ఆయా రాష్ట్రాలు కల్పించాలని కోరింది. కరోనా కట్టడిలో రాష్ట్రాలకు సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ 4 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందిపై దాడులు, మార్కెట్లు, బ్యాంకులు, రేషన్ షాపుల వద్ద వ్యక్తిగత దూరం పాటించకపోవడం, ప్రయాణికులతో వాహనాలు రాకపోకలు సాగించడం.. మొదలైన ఆంక్షల ఉల్లంఘన తమ దృష్టికి వచ్చినట్లు హోం శాఖ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం ప్రకటించిన నిబంధనలను పాటించాలని కోరుతూ హోం శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
మమత సీరియస్
లాక్‌డౌన్ ఉల్లంఘనలను పరిశీలించేందుకు కేంద్రం అధికార బృందాలను పంపిస్తుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఏ ప్రాతిపదికన వారు కేంద్ర బృందాలను పంపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సరైన కారణాలు చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమన్నారు.
కేరళపై ఆగ్రహం
అవసరమైతే మరింత కఠిన నిబంధనలు విధించండి కాని కేంద్రం ప్రకటించిన ఆంక్షలను మాత్రం సడలించవద్దు అని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి సడలింపులు తమ దృష్టికి వచ్చాయంది. రెస్టారెంట్లు, క్షౌర శాలలను, స్టేషనరీ షాప్స్‌ను, పట్టణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, పట్టణాల్లో రవాణాను అనుమతించడంపై కేరళపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేరళ ప్రధాన కార్యదర్శి టామ్ జోస్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. లాక్‌డౌన్ నిబంధనలతో పాటు, వాటికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కేరళ ఉల్లంఘిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లాక్‌డౌన్ సడలింపులను రద్దు చేసుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment