ఐడియా 4జీ సేవలు ఆరంభం
► దక్షిణాది రాష్ట్రాలతో మొదలు
► జాబితాలో లేని ప్రధాన నగరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులర్ 4జీ ఎల్‌టీఈ సేవలను బుధవారం ప్రారంభించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి), కర్ణాటక, తమిళనాడు, కేరళ సర్కిళ్లలో ఈ సేవలను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి నాలుగు సర్కిళ్లకుగాను 75 పట్టణాల్లో కస్టమర్లు 4జీ ఎల్‌టీఈని పొందవచ్చు. అయితే ఈ జాబితాలో ప్రధాన నగరాలేవీ లేవు.
4జీ సర్వీసుల కోసం 10 లక్షల మందికిపైగా కస్టమర్లు ప్రీ-బుక్ ఆఫర్‌ను వినియోగించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 4జీ చందాదారుల సంఖ్య 100 కోట్లను దాటిందని ఐడియా సెల్యుల ర్ ఎండీ హిమాన్షు కపానియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 4జీ రంగంలో ప్రవేశించడం ద్వారా ఐడియా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ విస్తరించడమేగాక బ్రాండ్ స్థానం మరింత మెరుగుపడుతుందని చెప్పారు.
టాప్ సిటీలు మిస్..
దక్షిణాదిన ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మంగళూరు, కోయంబత్తూరు కస్టమర్లకు ఐడియా నిరాశే మిగిల్చింది. ఈ నగరాల్లో మార్చిలో 4జీ సేవలు ప్రారంభమవుతాయి. ఏపీ సర్కిల్‌లో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన పట్టణాల్లో కరీంనగర్, నిజామాబాద్, కడప, రాజంపేట, తిరుపతి, విజయవాడ, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, వైజాగ్, విజయనగరం ఉన్నాయి. డిసెంబరు 31 కల్లా గుంటూరు, కాకినాడ సహా దక్షిణాదిన పలు పట్టణాలు జతవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 122 పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ సర్వీసులను ప్రారంభిస్తామని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. బాన్సువాడ, భైంసా, సిరిసిల్ల, రాజంపేట్, నంద్యాల వంటి చిన్న పట్టణాలూ వీటిలో ఉండడం విశేషం.
రూ.29 మొదలుకుని..
ఐడియా సెల్యులర్ 4జీ ట్రయల్ ప్యాక్స్‌ను రూ.29 నుంచి అందుబాటులోకి తెచ్చింది. 1జీబీ ఆపైన తీసుకునే డేటా ప్యాక్స్‌పై డబుల్ డేటా ఆఫర్‌ను మార్చి 31 వరకు అమలు చేస్తోంది. 1జీబీ ప్యాక్‌లు రూ.250 నుంచి ప్రారంభమవుతున్నాయి. మ్యూజిక్, సినిమా, గేమ్స్‌కు ప్రత్యేక ప్యాక్‌లు ఉన్నాయి. అల్టిమేట్ ప్లాన్స్ కింద అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యమూ ఉంది. డాంగిల్స్ రూ.2,599 నుంచి లభిస్తున్నాయి. 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీలో 2015-16లో దేశవ్యాప్తంగా 40-45 వేల టవర్లను ఏర్పాటు చేస్తున్న ఐడియా.. విస్తరణకురూ.6,500 కోట్లను కేటాయించింది.