భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమి త్ షా శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరు మల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి, శ్రీవారి చిత్రపటం అందజేశారు.
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుపతిలో శుక్రవారం జరిగిన టీడీపీ కార్యకర్తల దాడితో ఏపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి జడ్ ప్లస్ కేటగిరి రక్షణ వ్యవస్థ కలిగిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనలో భద్రతను గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అలిపిరి వద్ద చోటుచోసుకున్న ఈ ఘటన ఏపీ పోలీసు వ్యవస్థలోని డొల్లతనం బయటపడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షా కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు రువ్వడంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ)వర్గాలు ఆరా తీశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు బీజేపీ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నెల 12న ఏపీ పోలీస్ టెక్ భవనాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాను తలుచుకుంటే కేంద్ర వాహనాలు తిరగనివ్వననే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఇటీవల పలు సభల్లో చంద్రబాబు నుంచి మంత్రులు వరకు అందరూ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు గుర్తించాయి. అలిపిరి ఘటనలో పాల్గొన్నది ఎవరు? వారికి వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు? అనే కోణాల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల తీరుపై కూడా వారు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది.
అలాగే, దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఏపీ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ నివేదిక కోరినట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ హోం మంత్రి చినరాజప్ప దాడి జరగలేదని ప్రకటించడం వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment