=సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆదేశాలు బేఖాతర్
=మావోయిస్టుల నుంచి ముప్పు
=తరచూ దొంగతనాలు
సీలేరు, న్యూస్‌లైన్ : రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తూ రూ.వేల కోట్ల ఆదాయం ఇస్తున్న విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రం భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో దొంగదారుల మధ్య విద్యుత్ వెలుగులు నింపుతోంది. సీలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో అంతర్రాష్ట్ర రోడ్డుకు ఆనుకొని రెండు కొండల మధ్య రెండు హెక్టార్లలో 1968లో విదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం చేపట్టిన ఈ జలవిద్యుత్ కేంద్రం ఎన్నో అవార్డులు సాధించించింది. అలాంటి విద్యుత్ కేంద్రం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
రాష్ట్రంలో ఉగ్రవాదుల, మావోయిస్టుల దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాలపై మావోయిస్టులు దాడులకు పాల్పడి కోట్లాది రూపాయలు నష్టం కలిగించినా వాటికి రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ దాడులు అనంతరం సెంట్రల్ ఇంటెలీజెన్స్ అధికారులు విద్యుత్ కేంద్రాలను పరిశీలించి భద్రత మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. 2005లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని మావోయిస్టులు పేల్చివేసిన అనంతరం సెంట్రల్ ఇంటెలిజెన్స్ బృందం పరిశీలించి ఈ కేంద్రం చుట్టూ మెటల్ డిటెక్టర్ కంచెను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ జెన్‌కో సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
దొంగదారుల్లో చోరీలు...
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో తరచూ దొంగదారుల్లో చోరీలు జోరుగా సాగుతున్నాయి. విద్యుత్ కేంద్రం చుట్టూ భద్రత లేకపోవడంతో ఈ దొంగతనాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువయిన విదేశీ పరికరాలు, విలువైన సామాగ్రి దొంగల పాలవుతున్నాయి. గతేడాది విద్యుత్ కేంద్రంలో వేసిన తాళాలు వేసినట్టు ఉండగానే రూ.లక్షల విలువ చేసే కాపర్ పరికరాలు మాయమయ్యాయి. దీంతో ఈ సంగతి తెలిస్తే తమకెక్కడ ఉచ్చు బిగుస్తుందోనన్న భయంతో బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.
ప్రస్తుతం విద్యుత్ కేంద్రం చుట్టూ ముళ్ల కంచె ఉండడంతోనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల కిందట విద్యుత్ కాంప్లెక్స్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించేందుకు రూ.కోటి 40 లక్షలు నిధులు మంజూరు చేశారు. వాటిని అక్కడి ఉద్యోగుల ఇళ్లకు మాత్రమే రక్షణ గోడ నిర్మించారని, విద్యుత్ కేంద్రానికి మాత్రం నిర్మించలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి జలవిద్యుత్ కేంద్రాలకు గట్టి భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై జలవిద్యుత్ కేంద్రం భద్రతా అధికారి కోటేశ్వరరావును వివరణ కోరగా భద్రత మరింత కట్టుదిట్టం చేశామని, నిరంతరం నలుగురు హోంగార్డులు విధుల్లో ఉంటున్నార న్నారు. వచ్చిపోయే వారిని తనిఖీలు చేపట్టి విడిచి పెడుతున్నామని చెప్పారు.