వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నజీముద్దీన్, ఎస్‌హెచ్‌ఓ రాజశేఖరరెడ్డి, వెనుక నిలబడి ఉన్న నిందితులు
సాక్షి, గుంటూరు : విద్యార్థి కిడ్నాప్‌కు విఫలయత్నం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్.ఎం.నజీముద్దీన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎస్.వి.రాజశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన సానిమల్లికార్జున గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బ్రాడీపేటలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన ఉదయం 3 గంటల సమయంలో మాచర్ల నుంచి వస్తున్న తన రూమ్‌మెట్ సాంబశివరావును తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు తన సైకిల్‌పై మూడు వంతెనల బ్రిడ్జి కింద నుంచి నెహ్రూనగర్ రైల్వే ట్రాక్ పక్కగా రామిరెడ్డితోట ప్రధాన రహదారిపై వెళుతున్నాడు.
పోలేరమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి నలుగురు యువకులు కారును అడ్డుపెట్టి మల్లికార్జునను బలవంతంగా కారులో ఎక్కించారు. వారి వద్ద ఉన్న పిస్టల్ చూపించి తాము పోలీసులమని, నీలాంటివాళ్ల వల్ల రాత్రి వేళల్లో విధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బెదిరించారు. అయితే సదరు విద్యార్థి నుంచి సెల్‌ఫోన్, ఐడీ కార్డు లాక్కున్నారు. ఆ తర్వాత అక్కడ కారు ఎక్కించుకుని బస్టాండ్ పరిసర ప్రాంతంలోని గాయత్రి హోటల్‌లో వద్దకు వెళ్లారు. అక్కడ రక్షక్ వాహనాన్ని చూసిన నలుగురు కారు వదిలేసి తలో దిక్కు పారిపోయారు. అనంతరం మల్లికార్జున రక్షక్ ఇన్‌చార్జి షేక్ యూనస్‌బేగ్‌కు సమాచారం చెప్పగా, పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే కారును, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు కూడా విద్యార్థులే..
కొత్తపేట ఎస్‌హెచ్‌ఓ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రంగంలో దిగిన బృందం నలుగురిని ఈనెల 18వ తేదీన మణిపురం బ్రిడ్జి పక్కన సింగ్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు అంగీకరించారు. పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వెనిగండ్ల చైతన్యకృష్ణ, రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామానికి చెందిన వడ్లమూడి నాగబాబు, కాకుమాను మండలం కొండుపాటూరు గ్రామానికి చెందిన పూనం మనోజ్, వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావును అరెస్టు చేశారు. నిందితులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. అయితే ఎస్వీఎన్‌కాలనీలో ఒక రూము అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీ నగర్‌లో నివాసం ఉండే మద్దుకూరి రామబ్రహ్మం వద్ద నుంచి చైతన్యకృష్ణ సొంత పనుల నిమిత్తం కారు కావాలని తీసుకున్నాడు.
దీంతోపాటు, మరో స్నేహితుడు అభిరామ్ అమెరికా వెళుతూ తన ఇంట్లో అప్పగించమని ఇచ్చిన పిస్టల్‌ను దగ్గరపెట్టుకుని అమాయకుల్ని బెదిరించి డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 14వ తేదీన ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడు ఉపయోగించిన పిస్టల్ సామర్థ్యం, పనిచేసే తీరు తదితర అంశాలు తెలుసుకునేందుకు దాన్ని ల్యాబ్‌కు పంపనున్నారు. అలాగే వెనిగళ్ల చైతన్య కృష్ణ మరికొద్దిరోజుల్లో విదేశాలకు వెళ్లనున్నారు. ఈక్రమంలో అతని పాస్‌పోర్టు కూడా సీజ్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏఎస్సై ఆంథోని, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సులు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment